- ఒడిశా డిప్యూటీ సీఎం ఆదేశాలు
అసలే ఎండలు మండుతున్నాయి. ప్రతి ఇంట్లో వారివారి స్థాయిలను బట్టి ఏసీలు, ఎయిర్‌కూలర్లు, ఫ్యాన్లు తెగ తిరుగుతున్నాయి. ఈ సమయంలో కరెంట్ కట్ అయితే? విద్యుత్తు బిల్లు చెల్లించలేదని ఉన్నపళాన కనెక్షన్ ఊడబీకితే? ఆ ఇంట్లో ఉండే కుటుంబానికి ఎదురయ్యే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అప్పటికప్పుడు ఎవరి దగ్గరో అప్పు చేసి లేదా ఉన్న డబ్బుల్లోంచే బిల్లు కట్టేదాకా మళ్లీ ఆ ఇంట్లో గాలి ఆడదు. ఈ ఇబ్బందిని గమనించిన ఒడిశా ప్రభుత్వం అందరూ ఆహ్వానించే నిర్ణయం తీసుకుంది.
విద్యుత్ కనెక్షన్ లేకపోతే ప్రజలు ఇబ్బందులకు గురవుతారని గుర్తించి.. ఎండాకాలంలో గృహ విద్యుత్ వినియోగదారులు నెలవారీ బిల్లులు చెల్లించకపోయినా సరే కనెక్షన్ కట్ చేయవద్దని ఆదేశించిది. ఈ ఉప ముఖ్యమంత్రి కనక్ వర్థన్ సింగ్ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్యుత్ సరఫరాకు ఆటంకాలు కాకుండా నిరంతరం సరఫరా కొనసాగించాలని, విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరమ్మత్తులు, నిర్వహణ పనులు చేయాల్సి ఉంటే ముందుగానే ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఈ సమాచారాన్ని ప్రతి వినియోగదారుడి మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియచేయాలన్నారు.
నిర్వహణ పేరుతో సరఫరా నిలిపివేస్తున్నారని, ఎండాకాలంలో వేడి తట్టుకోలేక గంటల కొద్దీ ఇబ్బందులు పడుతున్నట్లు వినియోగదారులు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరంలో కూడా మధ్యాహ్నం సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం మూలంగా ఇబ్బందులు పడుతున్నామని, వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని పలువురు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ కూడా పరిస్థితిని సమీక్షించారు. పట్టణాలు, నగరాల్లో నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపివేయడం మూలంగా రోజు వారీ పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వ్యాపారాలు నిర్వహించుకోలేని పరిస్థితి తలెత్తుతున్నాయని ఆయన విద్యుత్ పంపిణీ సంస్థలకు స్పష్టం చేశారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు ఫిర్యాదులు అందినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటానని విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులను హెచ్చరించారు. ఈ పరిణామాలకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎండాకాలంలో ఎక్కడ కూడా సరఫరా లేదని, నిలిపివేశారని, పునరుద్ధరించడం లేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణలో బిల్లు చెల్లించకపోతే అంతే
తెలంగాణ రాష్ట్రంలో ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించకపోతే రెండు మూడు రోజుల తరువాత లైన్ మెన్ వచ్చి సర్వీస్ కనెక్షన్ కట్ చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఎండాకాలంలో విద్యుత్ లేకపోతే ఏ పనీ చేసుకోలేమని, ఇంట్లో ఉండలేని పరిస్థితులు ఉంటాయని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఒక నెల విద్యుత్ బిల్లు చెల్లించకపోయినా, పెండింగ్ బకాయిలు ఉన్నా విద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడాలని వినియోగదారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కోరుతున్నారు.
