ఉత్తరాదిని ముంచెత్తిన భారీ వర్షాలు.. ఢిల్లీలో యమున ఉగ్రరూపం

ఉత్తర భారత్, ఢిల్లీ భారీ వర్షాలు, యమునా వరద ఉగ్రరూపం, పలు రాష్ట్రాల్లో రోడ్లు, పంటలు, స్కూల్‌లు ప్రభావితం.

ఉత్తరాదిని ముంచెత్తిన భారీ వర్షాలు.. ఢిల్లీలో యమున ఉగ్రరూపం

న్యూఢిల్లీ : ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు బీభత్సం స్పష్టిస్తున్నాయి. ప్రధాన నదులు, వాగులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడి పలువురు చనిపోయారు. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్ లోని చాలా ప్రాంతాలు జలమయంలో ఉన్నాయి. లూథియానాలో అత్యధికంగా 216 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పఠాన్‌కోట్‌, గురుదాస్‌పూర్‌, ఫిరోజ్‌పూర్‌, అమృత్‌సర్‌ జిల్లాల్లో వర్షం కారణంగా పంటనష్టం వాటిల్లింది. పంజాబ్‌లోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర భారతదేశంలో వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 3 వరకు అన్ని విద్యాసంస్థలు మూసివేస్తూ పంజాబ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్షాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

ఢిల్లీలో భారీ వర్షాలు

మరోపక్క దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాని కారణంగా యమునా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో ఉగ్రరూపం దాల్చింది. దీని కారణంగా ఢిల్లీలో భారీ వరదలు వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే యమునా బజార్‌ను వరద నీరు ముంచెత్తింది. ఇక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సహాయ శిబిరాలకు తరలి వెళుతున్నారు. హర్యానాలోని హత్నికుంద్‌ బరాజ్‌ నుంచి భారీగా నీటి విడుదల కూడా యమునానదిలో నేటిమట్టం వేగంగా పెరగడానికి కారణమైంది. మంగళవారం ఉదయానికి నీటిమట్టం 205.68 మీటర్ల వద్ద ఉండగా, సాయంత్రం 5 గంటల వరకు 206.50 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

ఢిల్లీలో ఆకాశం మేఘావృతంగా ఉండి, సాధారణ వర్షం కొనసాగుతుందని వాతావరణ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా గురుగ్రామ్‌లో అనేక రోడ్లు నీట మునిగాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోగా, సాధారణ జీవనం స్తంభించింది. మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం సూచించింది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. దీంతో గురుగ్రామ్‌లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.