Rahul on caste census : మెరిట్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రచ్చ రచ్చ..
ప్రతిభ ఆధారంగా అవకాశాలు అనేది అగ్రకుల భావనగా రాహుల్ అభివర్ణించారు. ఇది సహేతుకమైనది కాదని అన్నారు. ప్రతిభ అనే కాన్సెప్ట్ లోపభూయిష్టమైనదని విమర్శించారు. అది మన సామర్థ్యాలతో సామాజిక స్థాయిని గందరగోళ పరుస్తాయని అన్నారు.
Rahul on caste census : దేశంలో కుల గణన ఆవశ్యకతను లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోమారు నొక్కి చెప్పారు. అసమానతలు, వివక్ష వాస్తవ రూపాన్ని బయటకు తెచ్చేందుకు ఇది అత్యంత ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను, యూజీసీ మాజీ చైర్మన్, విద్యావేత్త సుఖ్‌దేవ్ థోరట్‌తో ఆయన సంభాషించిన వీడియోను రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రఖ్యాత విద్యావేత్త, ఆర్థికవేత్త, దళిత అంశాలపై నిపుణుడు, తెలంగాణలో నిర్వహించిన కుల గణన అధ్యయన కమిటీ సభ్యుడు అయిన ప్రొఫెసర్ థోరట్‌తో మహద్ సత్యాగ్రహ, పరిపాలన, విద్య, ప్రభుత్వోద్యోగాలు, వనరులపై దళితు హక్కు కోసం జరుగుతున్న పోరాటాలపై వివరంగా చర్చించాను’ అని రాహుల్ ఎక్స్‌లో తెలిపారు. ‘1927, మార్చి 20న మహద్ సత్యాగ్రహ ద్వారా కుల వివక్షను అంబేద్కర్ నేరుగా సవాలు చేశారు’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘అది కేవలం తాగునీటిపై హక్కు కోసం పోరాటం కాదు.. సమానత్వం, గౌరవం కోసం సాగిన పోరాటం. హక్కుగా రావాల్సిన వాటా కోసం పోరాటం. 98 ఏళ్ల క్రితం అది మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది’ అని రాహుల్ చెప్పారు. ‘అసమానతలు, వివక్ష అసలు రూపాన్ని బయటకు తీయడంలో కుల గణన అనేది ఒక ముఖ్యమైన అడుగు. అయితే.. దాని ప్రత్యర్థులు దానిని బయటపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. బాబా సాహెబ్ కల ఇంకా అసంపూర్ణంగానే ఉన్నది. అప్పటికే కాదు.. ఆయన పోరాటం ఇప్పటికీ కూడా. మా శక్తియుక్తులన్నింటినీ కూడబలుక్కొని పోరాడుతాం’ అని రాయ్‌బరేలీ ఎంపీ తేల్చి చెప్పారు.
ప్రతిభ.. అగ్రకుల భావన
ప్రతిభ ఆధారంగా అవకాశాలు అనేది అగ్రకుల భావనగా రాహుల్ అభివర్ణించారు. ఇది సహేతుకమైనది కాదని అన్నారు. ప్రతిభ అనే కాన్సెప్ట్ లోపభూయిష్టమైనదని విమర్శించారు. అది మన సామర్థ్యాలతో సామాజిక స్థాయిని గందరగోళ పరుస్తాయని అన్నారు. మన విద్యావ్యవస్థలోగానీ లేదా మన బ్యూరోక్రాటిక్ వ్యవస్థలోగానీ దళితులు, ఓబీసీలు, గిరిజనులకు న్యాయం జరుగుతున్నది అంటే అది పూర్తిగా తప్పేనని స్పష్టం చేశారు. అసలు ప్రతిభ ఆధారంగా అవకాశాలు అనే భావనే సహేతుకం కాదని తేల్చి చెప్పారు.
రాహుల్‌ది ఫ్యూడల్ మైండ్‌సెట్ : బీజేపీ
ప్రతిభ ఆధారంగా అవకాశాలు అన్నది అగ్రకుల భావన అన్న రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అది కాంగ్రెస్ ఫ్యూడల్ మైండ్‌సెట్‌ను బయటపెడుతున్నదని పేర్కొన్నది. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలుస్తున్నదా? అని బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ ప్రశ్నించారు. పేదరికం, సామాజిక అణచివేత నుంచి ప్రతిభ, స్వయం కృషితో లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలు ఎదిగారని, కానీ వారిని నిత్యం అవమానించే చరిత్ర కాంగ్రెస్ పార్టీదని బీజేపీ నేత సీఆర్ కేశవన్ మండిపడ్డారు. వారసత్వంతో ఎదిగిన రాహుల్‌కు పోటీపడి రాణించడం అంటే ఏమిటో ఎలా తెలుస్తుందని అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram