డౌటే లేదు! ఆ బిల్లుల ఉద్దేశం.. ప్రతిపక్షమే ప్రధాన టార్గెట్‌! ఇదిగో లెక్కలు!

మోదీ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షాలపై వ్యవహరించిన తీరు గమనిస్తే.. ఈ బిల్లు తెచ్చిందే ప్రతిపక్షాలను అణచివేసేందుకు అని అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇందుకు వివిధ సంఘటనలు, సందర్భాలను వారు ఉదహరిస్తున్నారు.

డౌటే లేదు! ఆ బిల్లుల ఉద్దేశం.. ప్రతిపక్షమే ప్రధాన టార్గెట్‌! ఇదిగో లెక్కలు!

130th Constitutional Amendment Bill | ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజులపాటు జైల్లో ఉంటే ఆటోమేటిక్‌గా పదవీచ్యుతులయ్యేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి, ఆ యా రాష్ట్రాల మంత్రుల విషయంలో నిర్ణయాధికారం సంబంధిత రాష్ట్రాల గవర్నర్లకు, ప్రధాని, కేంద్రమంత్రుల విషయంలో రాష్ట్రపతికి ఈ బిల్లు కట్టబెడుతున్నది. దీనిని ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసేందుకు, ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో అనిశ్చితి నెలకొల్పేందుకు దీనిని ఉద్దేశించినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏ కేసులోనైనా నేరం రుజువు కానప్పటికీ 30 రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిగ్‌గా పదవీచ్యులు అవుతారని బిల్లు చెబుతున్నది. అంటే.. ఏదో ఒక ఫిర్యాదు ఆధారంగా ముఖ్యమంత్రులు లేదా రాష్ట్ర మంత్రులను జైల్లో పెట్టే అవకాశాలు ఉంటాయని, 30 రోజుల్లో రాజకీయంగా చేయాల్సినన్ని అక్రమాలు చేస్తారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రధాని మోదీ, హో మంత్రి అమిత్‌ షా మాత్రం జైల్లో ఉండి రాష్ట్రాలను పాలిస్తామంటూ ఊరుకోవాలా? అని హూంకరిస్తున్నారు. ఇది ప్రతిపక్షాలు టార్గెట్‌ తెచ్చిన బిల్లు కానేకాదని కుండబద్దలు కొడుతున్నారు.

కానీ గణాంకాలు, మోదీ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షాలపై వ్యవహరించిన తీరు గమనిస్తే.. ఈ బిల్లు తెచ్చిందే ప్రతిపక్షాలను అణచివేసేందుకు అని అర్థమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇందుకు వివిధ సంఘటనలు, సందర్భాలను వారు ఉదహరిస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల చరిత్ర చూస్తే.. ప్రతిపక్షాలను వీలైనన్ని మార్గాల్లో కట్టడి చేసేందుకు జరిగిన ప్రయత్నాలు కనిపిస్తాయని అంటున్నారు. అదే సమయంలో అధికార పక్షానికి లొంగిపోయినవారిపై గతంలో ఉన్న కేసులు అన్నీ అనూహ్యంగా, విచిత్రంగా మాయమైపోయి, వాళ్లు సుద్ధపూసల్లా బయటకు వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ప్రతిపాదించిన బిల్లు ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్‌ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు ప్రభుత్వ గణాంకాలు, వివిధ పత్రికల్లో వచ్చిన వివరాలను వారు ప్రస్తావిస్తున్నారు.

1. 2015 నుంచి 2025 వరకూ ప్రతిపక్ష నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 193 కేసులలో కేవలం ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చారు. అంటే ఈడీ కేసులలో కన్విక్షన్‌ రేటు 1శాతం. ఇవి ప్రభుత్వ లెక్కలే.

2. 2014 నుంచి ఇప్పటి వరకూ 12 ప్రతిపక్ష మంత్రులు 30 రోజులకంటే ఎక్కువ కాలం జైల్లో ఉన్నారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంటున్నది. వీటిలో చాలా కేసులు ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌కు చెందిన నాయకులపైనే ఉన్నాయి. అందులోనూ అన్నీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద నమోదైనవే.

3. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ పెట్టిన కేసులలో 95 శాతం ప్రతిపక్షాల నాయకులపైనేనని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంటున్నది. 2014 నుంచి 2022 సెప్టెంబర్‌ వరకు 121 మంది ప్రముఖ నాయకులపై ఈడీ తనిఖీలు, సోదాలు నిర్వహిస్తే.. అందులో 115 మంది ప్రతిపక్ష పార్టీల నాయకులే. ఆ తర్వాత జరిగిన సోదాలూ ప్రతిపక్ష నాయకులపైనే ఉన్నాయి.

4. 2014లో నరేంద్రమోదీ ప్రధానిగా పదవిని చేపట్టిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన అవినీతి కేసులు ఉన్న సుమారు 25 మంది ప్రముఖ రాజకీయ నాయకులు ప్లేటు ఫిరాయించి, బీజేపీలో చేరిపోయారు. వారిలో 23 మందిపై ఉన్న కేసులు అన్నీ మాయమపోయాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంటున్నది. మహారాష్ట్రలో ఇద్దరు ప్రముఖ ప్రతిపక్ష నేతలు బీజేపీ పక్షాన చేరిపోవడం, వారిపై కేసులు కోల్డ్‌ స్టోరేజ్‌లోకి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. వీరిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ కేంద్రమంత్రి ఉన్నారు. వారిద్దరికీ తదుపరి రాజ్యసభ సభ్యత్వాలు లభించాయి.

5. ఇప్పుడు జైలులో ఉన్నవారిలో 90.66 శాతం మంది విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలే (అండర్‌ ట్రయల్‌)నని తీహార్‌ జైల్‌ వెబ్‌సైట్‌ లెక్కలు చెబుతున్నాయి. వారిపై ఆరోపించిన నేరాలు రుజువైతే ఎంత కాలం శిక్ష పడుతుందో అంతకు మించిన కాలం జైలు జీవితంలోనే సరిపోతున్నది. సాధారణ కేసులలోనూ నిర్దోషిగా బయటపడటానికి సుదీర్ఘ సమయం తీసుకుంటున్నది.

6. రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక మంత్రివర్గం ఉండాలని, రాష్ట్రపతికి సలహాలు, సూచనలు చేయడం దాని ప్రధాన పాత్ర అని ఆర్టికల్‌ 74(1) చెబుతున్నది. రాష్ట్రపతి తన అధికారాలను నిర్వహించేటప్పుడు మంత్రివర్గం ఇచ్చిన సలహాలను అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంటున్నది. రాష్ట్రపతి ఎప్పుడు, ఎలా మంత్రివర్గం సలహా కోరాలి? లేదా దానిని పునఃపరిశీలించమని అడగాలి? అనే విషయాల్లో తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకునే వీలు ఉన్నప్పటికీ.. అంతిమంగా మంత్రివర్గం యొక్క సలహానే అనుసరించాల్సి ఉంటుందని చెబుతున్నది. దీనిని గమనంలో ఉంచుకున్నట్టయితే.. ప్రధాన మంత్రిని రాష్ట్రపతి తొలగించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యపు ఈ ప్రాథమిక సిద్ధాంతాన్ని తారుమారు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

7. కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే.. పార్లమెంటు ఉభయ సభలు మూడింట రెండొంతుల మెజార్టీతో దానిని ఆమోదించాల్సి ఉంటుంది. బీజేపీకి లోక్‌సభలో సొంతగా సాధారణ మెజార్టీ కూడా లేదు. మొత్తం భాగస్వామ్య పక్షాలు (ఎన్డీయే)తోపాటు గణనీయమైన సంఖ్యలో ప్రతిపక్షం నుంచి మద్దతు లభిస్తేనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది.