మళ్లీ ఉభయ సభలు వాయిదా..మధ్యాహ్నం యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ

పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. మంగళవారం కూడా లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం నుంచి లోక్ సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు 2026’ పై చర్చ, బిల్లుకు ఆమోదం ప్రక్రియ కొనసాగనుంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. మంగళవారం కూడా లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాయి.

అయితే ప్రభుత్వం దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని, ప్రశ్నోత్తరాల తర్వాత అన్ని అంశాలపై చర్చిద్దామని , యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చకు సహకరించాలని లోక్ సభలో స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు నినదాలు ఆపకపోవడంతో అటు లోక్‌సభను స్పీకర్, ఇటు రాజ్యసభను చైర్మన్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం లోక్ సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ పై చర్చ, బిల్లుకు ఆమోదం ప్రక్రియ కొనసాగనుంది.

దిగువ సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, కేంద్ర మంత్రులు పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ స్టాండింగ్ కమిటీ నివేదికల సమర్పణ, పార్లమెంటరీ కమిటీ సిఫారసుల అమలుపై ప్రకటనలు ఉంటాయి. గౌహతి ఎయిమ్స్ పాలకమండలికి లోక్‌సభ సభ్యుడి ఎన్నిక కోసం తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు రాజ్యసభలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టనుండగా, ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు.

‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ 2026’ బిల్లు వివరాలు

ఈ బిల్లు ప్రకారం ప్రశ్నపత్రాల లీకేజీ లేదా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. నేర తీవ్రతను బట్టి ఈ శిక్షను పదేళ్ల వరకు పెంచే అవకాశం ఉంటుంది. అలాగే గరిష్టంగా రూ.50 లక్షల వరకు జరిమానా విధించే నిబంధనను ప్రతిపాదించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టంలో మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష, గరిష్టంగా రూ.10 లక్షల జరిమానా మాత్రమే ఉండగా, కొత్త సవరణతో శిక్షలను మరింత కఠినతరం చేస్తున్నారు.

వ్యవస్థీకృతంగా పరీక్షల అక్రమాలకు పాల్పడే ముఠాలు, సంస్థలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా బిల్లు రూపుదిద్దుకుంది. అలాంటి కేసుల్లో కనీస శిక్షను ఏడేళ్లకు పెంచడంతో పాటు, గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం కల్పించారు. పరీక్షలు నిర్వహించే సేవా సంస్థలు నేరాలకు పాల్పడితే వాటిపై గరిష్టంగా రూ.5 కోట్ల జరిమానా విధించడంతో పాటు, ప్రభుత్వ పరీక్షలు నిర్వహించే అర్హతను నాలుగేళ్ల స్థానంలో ఎనిమిదేళ్ల వరకు రద్దు చేసే నిబంధనను కూడా చేర్చారు.

పరీక్షల అవకతవకలపై వేగంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక విధానాలు కూడా ఈ బిల్లులో ఉన్నాయి. పేపర్ లీక్ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలు చేసిన మూడు నెలల్లోగా విచారణ ముగించేలా ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వనున్నారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాలు (టాస్క్ ఫోర్స్), ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే వెసులుబాటు కూడా కేంద్రానికి ఉంటుంది.

అదేవిధంగా బయోమెట్రిక్ నమోదు, అభ్యర్థుల చెక్-ఇన్, ప్రశ్నపత్రాల భద్రత, పర్యవేక్షణ, పరీక్షా కేంద్రాల నిర్వహణ వంటి అంశాలకు స్పష్టమైన నిబంధనలు తీసుకురానున్నారు. ప్రశ్నపత్రాల లీక్, ఓఎంఆర్ షీట్ల తారుమారు, నకిలీ అడ్మిట్ కార్డులు జారీ చేయడం, నకిలీ వెబ్‌సైట్లు సృష్టించడం వంటి 15 రకాల అక్రమాలను ప్రత్యేక నేరాలుగా గుర్తించారు.

Latest News