నాల్గవ రోజు పార్లమెంటు సమావేశాలు వాయిదా!

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల మధ్య వరుసగా నాల్గవ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడ్డాయి.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల మధ్య వరుసగా నాల్గవ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడ్డాయి. లోక్ సభ సమావేశాలు ప్రారంభంకాగానే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని, ఆ తర్వాతే విద్యావ్యవస్థపై చర్చ కొనసాగించాలంటూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి.

స్పీకర్ ఓంబిర్లా వారించినా వినకుండా నిరసనలు, నినాదాలకు దిగడం..పోటీగా అధికార ఎన్డీఏ సభ్యులు సైతం నినాదాలు చేయడంత సభ అట్టుడికిపోయింది. దీంతో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. సభా వాయిదా వేసిన అనంతరం కూడా లోక్ సభ ప్రాంగణంలో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా నినాదాలు కొనసాగించాయి.

అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగడంతో  చైర్మన్ సభను వాయిదా వేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని ప్రకటించినప్పటికి..రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాత్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరమే చర్చకు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అధికార, ప్రతిపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12గంటలకు వాయిదా పడింది.

Latest News