Pm Modi Open Letter To Nation On GST | జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలకు లాభం: మోడీ బహిరంగ లేఖ
జీఎస్టీ సంస్కరణలు అన్ని వర్గాలకూ లాభం చేకూరుస్తున్నాయని ప్రధాని మోడీ బహిరంగ లేఖలో తెలిపారు.

జీఎస్టీ సంస్కరణలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు. దేశ వ్యాప్తంగా జీఎస్టీ బచావత్ ఉత్సవ్ ప్రారంభమైందన్నారు. జీఎస్టీల్లో తెచ్చిన మార్పులు ప్రజల్లో పొదుపును పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలకు జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. ఆర్ధికాభివృద్ది, పెట్టుబడులను పెంచేందుకు జీఎస్టీ సంస్కరణలు పనికొస్తాయని ఆయన చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను మరింత సరళతరం చేస్తాయని ఆయన అన్నారు.వికసిత్ భారత్ సాధనకు ఇది దోహదం చేస్తోందని ప్రధాని చెప్పారు. దేశీయ ఉత్పత్తిదారులకు జీఎస్టీ సంస్కరణలు ఊతమిస్తాయని ఆయన చెప్పారు. ప్రజలు కూడా స్వదేశీ వస్తువలనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
జీఎస్టీ గతంలో నాలుగు స్లాబ్‌లుగా ఉండేది. అయితే ప్రస్తుతం దాన్ని రెండు స్లాబులకు కుదించారు. సెప్టెంబర్ 22 నుంచి మారిన జీఎస్టీ అమల్లోకి వచ్చింది. జీఎస్టీ స్లాబుల్లో మార్పుల నేపథ్యంలో సెప్టెంబర్ 21న జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. జీఎస్టీ స్లాబుల్లో మార్పులతో పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు తొలగుతాయన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే వస్తువులు, సరుకులపై తక్కువ శాతం పన్ను ఉంటుందని ఆయన అన్నారు. చాలా వస్తువులపై పన్ను భారం లేకుండా చేశామని ఆయన అన్నారు.