President of India | మళ్లీ ఉపాధ్యాయురాలిగా మారిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ
భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము మరోసారి తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తి బాధ్యతలు నిర్వర్తించారు.

విధాత, హైదరాబాద్ : భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము మరోసారి తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తి బాధ్యతలు నిర్వర్తించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఉపాధ్యాయురాలిగా మారి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. గ్లోబల్ వార్మింగ్ అంశంపై వారికి బోధించారు. భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని వివరించారు. పర్యావరణ మార్పు ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి)’ గురించి ప్రస్తావించారు. ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని సూచించారు. తొలుత విద్యార్థుల పేర్లు అడిగి వారితో ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మూ మాట్లాడుతూ ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, సాంకేతికంగా వీరికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. సృజన్మాకతతో ముందుకు సాగాలన్నారు. కాగా ఒడిశాకు చెందిన ద్రౌపదీ ముర్ము దేశ 15వ రాష్ట్రపతిగా 2022 జులై 25న ప్రమాణస్వీకారం చేశారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన తొలి ఆదివాసీ వ్యక్తిగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఈ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కురాలు కూడా ముర్మూనే కావడం విశేషం. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె ఝార్ఖండ్ గవర్నర్ వ్యవహరించారు. 1994-97 మధ్య రాయరంగపూర్‌లోని శ్రీఅరబిందో ఇంటిగ్రెడ్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో గౌరవ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేశారు.