కొడుకును తప్పించేందుకు తల్లి చేసిన పని.. రట్టు చేసిన పోలీసులు
మద్యం తాగి అతివేగంతో కారు నడిపి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమైన బాలుడి తల్లిని పుణె పోలీసులు శనివారం అరెస్టు చేశారు

పుణె యాక్సిడెంట్ కేసులో బాలుడి తల్లి అరెస్ట్
కుమారుడి బదులు తన రక్త నమూనాలు ఇచ్చిన తల్లి
సాక్ష్యాలు తారుమారు చేసినందుకు అరెస్టు చేసిన పోలీసులు
పుణె: మద్యం తాగి అతివేగంతో కారు నడిపి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమైన బాలుడి తల్లిని పుణె పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుడు చేసిన యాక్సిడెంట్ కేసులో అతని రక్తానికి బదులు తన రక్త నమూనా ఇచ్చి, సాక్ష్యాలను తారుమారు చేశారని దర్యాప్తులో గుర్తించిన నేపథ్యంలో శివానీ అగర్వాల్‌ను అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ అమితేశ్ కుమార్ చెప్పారు.
ప్రమాదానికి కారకుడైన బాలుడి రక్త నమూనాను చెత్తబుట్టలో పడేసి, అదేరోజు అక్కడే ఉన్న అతడి తల్లి, మరో ఇద్దరి రక్త నమూనాలను సస్సూన్ జనరల్ హాస్పిటల్ వర్గాలు సేకరించాయని అధికారులు తెలిపారు. దర్యాప్తులో ఈ విషయం బయటపడిందని కమిషనర్ చెప్పారు. తన కుమారుడిని అరెస్టు చేసిన మే 19వ తేదీ తర్వాత అతడు రికార్డు చేసిందిగా చెబుతున్న ర్యాప్ సాంగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే.. శివానీ ఆ వీడియో తన కుమారుడిది కాదని కన్నీరుమున్నీరయ్యారు.