Rahul Gandhi on IPS Puran Kumar Death | పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు నిందితులను శిక్షించాలి : రాహుల్ గాంధీ
ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు నిందితులను శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్. దళితులు ఉన్నత హోదాలకు చేరినా వివక్ష తప్పదనే తప్పుడు సందేశం వెళ్లకూడదని వ్యాఖ్య. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్.

న్యూఢిల్లీ : కుల వివక్షత, వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కేసులో నిందితులను వెంటనే గుర్తించి చట్టపర చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పూరన్ కుమార్ కుటుంబాన్ని కలిసి పరమార్శించారు. ఈ సందర్భంగా పూరన్‌కు నివాళులర్పించి మాట్లాడారు. అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. ఐపీఎస్ అధికారిపై జరిగిన వివక్ష దళితులుగా ఎంత విజయం సాధించినా..ఉన్నత హోదాలకు చేరినా అణచివేత తప్పదనే తప్పుడు సందేశం వారికి వెళ్లేలా చేస్తుందన్నారు. పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, సీఎంలను డిమాండ్ చేశారు.
ప్రభుత్వాధికారిపై ఇలాంటి కులవివక్షత చోటుచేసుకోవడం విషాదకరమని రాహుల్ గాంధీ అన్నారు. ఈ కేసుకు సంబంధించి స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని స్వయంగా హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చినప్పటికి.. రోజులు గడుస్తున్నా పురోగతి లేదని విమర్శించారు. తండ్రిని పోగొట్టుకున్న పూరన్‌కుమార్ ఇద్దరు పిల్లలు చాలా ఒత్తిడిలో ఉన్నారన్నారు. పూరన్ కుమార్ కెరీర్‌ను, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇతర అధికారులు సంవత్సరాలుగా వివక్ష కొనసాగించారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది కేవలం ఒక దళిత కుటుంబానికి సంబంధించినది కాదని, దేశంలోని కోట్లాది మంది దళితులకు సంబంధించినదని రాహుల్ వ్యాఖ్యానించారు.