మా ఫోన్లు హ్యాక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు… కేంద్ర‌ప్ర‌భుత్వంపై ఎంపీల విసుర్లు

మా ఫోన్లు హ్యాక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు… కేంద్ర‌ప్ర‌భుత్వంపై ఎంపీల విసుర్లు

త‌మ నాయ‌కుల ఐఫోన్లను మోదీ ప్ర‌భుత్వం హ్యాక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిందంటూ ప‌లు ప్ర‌తిప‌క్ష పార్టీలు గురువారం విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డాయి. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఉప‌యోగించే ఐఫోన్ల‌కు ‘మీపైన ప్ర‌భుత్వ వ‌ర్గాల మ‌ద్ద‌తు ఉన్న హ్యాక‌ర్ల‌ నుంచి మీ మొబైల్‌ను హ్యాక్ చేసేందుకు ప్ర‌య‌త్నం జ‌రిగింది’ అని అలెర్ట్ మెసేజ్‌లు వ‌చ్చాయి. దీంతో దుమారం రేగింది. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


ఇలాంటి హ్యాకింగ్ వ్య‌వ‌హారాల‌తో దేశంలో ఉన్న స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. ‘నా కార్యాల‌యంలో చాలా మంది సిబ్బందికి ఆపిల్ నుంచి ఈ అలెర్ట్ మెసేజ్ వ‌చ్చింది. కేసీ వేణుగోపాల్‌, సుప్రియా సూలే, ప‌వ‌న్ ఖేడా త‌దితరులూ ఈ అలెర్ట్‌ను అందుకున్నారు’ అని రాహుల్ పేర్కొన్నారు. వారికి (బీజేపీ) ఏది కావాలంటే అది చేసుకోవ‌చ్చ‌ని త‌న‌కు ఎలాంటి భ‌యం లేద‌ని ఆయ‌న స‌వాలు చేశారు.


తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మొయిత్రా మాట్లాడుతూ స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్‌, ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు రాఘ‌వ్ చ‌డ్డా, సీపీఎం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీతారాం యేచూరీలకు ఈ అలెర్ట్ వ‌చ్చింద‌ని తెలిపారు. ‘ఎవ‌రో తెలిసింది. సిగ్గు ప‌డాల్సిందే’ అంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ శివ‌సేన నాయ‌కురాలు ప్రియాంక చ‌తుర్వేది ఎక్స్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు.


కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ కూడా ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. ‘నా లాంటి వాళ్ల‌ నుంచి వ‌చ్చే ప‌న్నుల‌ను, స‌మర్థులైన అధికారుల‌ను ఇలాంటి ప‌నుల‌కే ఉప‌యోగించాలా? ఇంత కంటే ప‌నులేమీ లేవా అని ఎక్స్‌లో ప్ర‌శ్నించారు. దీనిపై ప్ర‌తి భార‌తీయుడూ దిగులు చెందాల్సిందే. ఎందుకంటే ఈ రోజు నేను.. రేపు మీరే కావొచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు.


ఆపిల్ ఏమంది?


భార‌త్‌లో జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హారంపై ఆపిల్ వివ‌ర‌ణ ఇచ్చింది. తమ మొబైల్స్ ఇచ్చిన అలెర్ట్ సందేశం ప్ర‌కారం.. అది ఏ ప్ర‌భుత్వం అనేది చెప్ప‌లేమ‌ని తెలిపింది. భార‌త ప్ర‌భుత్వమే హ్యాకింగ్ చేస్తోంద‌న్న ఎంపీల విమ‌ర్శ‌ల‌ను అది కొట్టిప‌డేసింది. వారికి వ‌చ్చిన మెసేజ్‌కు అర్థం అది కాద‌ని తెలిపింది. ఇలాంటి అలెర్ట్ మెసేజ్‌లు.. థ్రెట్ ఇంటెలిజెన్స్ సిగ్న‌ల్స్ ఆధారంగా వ‌స్తాయని పేర్కొంది.


అయితే థ్రెట్ ఇంటెలిజెన్స్ సిగ్న‌ల్స్ అసంపూర్ణ‌మైన‌వ‌ని, అస్ప‌ష్ట‌మైన‌వ‌ని స్ప‌ష్టం చేసింది. కాబ‌ట్టి ఆ అలెర్టులు.. త‌ప్పుడు హెచ్చ‌రిక‌లు కూడా కావొచ్చ‌ని సూచించింది. అయితే తాజా ఘ‌ట‌న‌లో ఇలా ఎందుకు మెసేజ్‌లు వ‌చ్చాయ‌న్న అంశాన్ని మేము చెప్ప‌బోమ‌ని.. ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తే హ్యాక‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని తెలిపింది.