Rahul Gandhi EC | రాహుల్ గాంధీ : బీజేపీ కోసం ఈసీ ఓట్ల దోపిడీ.. ఆటం బాంబులాంటి ఆధారాలు 

బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను దోచిపెడుతున్నదని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

Rahul Gandhi EC | రాహుల్ గాంధీ : బీజేపీ కోసం ఈసీ ఓట్ల దోపిడీ.. ఆటం బాంబులాంటి ఆధారాలు 

Rahul Gandhi EC : బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఓట్లను దోచిపెడుతున్నదని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. వీటిపై తమ వద్ద ‘ఆటం బాంబు’ లాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో, ఇతర రాష్ట్రాల్లో ఓటరు జాబితాకు సంబంధించి స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై శుక్రవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోయాయి. బీజేపీకి ఓట్లు దోచిపెట్టిన.. పై నుంచి కింది వరకూ ఇప్పుడు ఉన్న, గతంలో పనిచేసి రిటైర్‌ అయిన ఎన్నికల సంఘం అధికారులను వదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.

వంద శాతం ఆధారాలు ఉన్నాయి

‘ఓట్ల చోరీ జరుగుతున్నదని నేను చెబుతూ వచ్చాను. ఇప్పుడు ఇందులో ఎన్నికల సంఘం కూడా భాగస్వామి అయిందని చెప్పేందుకు సాక్ష్యాలు ఉన్నాయి. దీన్నేదో నేను తేలిగ్గా చెప్పడం లేదు. వందశాతం ఆధారాలతోనే మాట్లాడుతున్నాను. ఈ వివరాలు మేం బయటపెట్టగానే అందరికీ తెలుస్తుంది. ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని యావత్‌ దేశానికి తెలిసిపోతుంది. అది బీజేపీ కోసమే. మరో ప్రశ్నే లేదు’ అని రాహుల్‌ గాంధీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో తమకు సందేహాలు కలిగాయని రాహుల్‌ తెలిపారు. ‘మహారాష్ట్ర ఎన్నికల నాటికి ఇది మరింత పెరిగింది. ఓట్ల చోరీ జరిగిందని, కొత్తగా ఓటర్ల చేరికలు చోటు చేసుకున్నాయని భావించాం. దీనిపై కొంత లోతుగా అధ్యయనం చేశాం. ఈసీ సహకరించకపోవడంతో మా అంతట మేమే దర్యాప్తు చేశాం’ అని రాహుల్‌ గాంధీ వివరించారు. దీనికి ఆరు నెలలు పట్టిందని చెప్పారు. ‘చివరికి ఆటం బాంబులాంటి ఆధారాలను మేం కనుగొన్నాం. అది పేలితే ఈసీ దాక్కునేందుకు కూడా సాధ్యం కాదు’ అని అన్నారు.

వదిలేది లేదు

‘ఈ విషయాన్ని నేను సీరియస్‌గానే చెబుతున్నాను. ఎవరైతే ఈ పని చేస్తున్నారో.. వాళ్లు కింది స్థాయి అధికారులు కావచ్చు.. పై స్థాయిలో ఉండొచ్చు.. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఏం జరిగినా సరే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు భారతదేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇది ద్రోహం. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఎవరైనా సరే.. మీరు రిటైర్‌ అయి ఉన్నా సరే.. మీ స్థాయి ఏదైనప్పటికీ మేం మిమ్మల్ని గుర్తించి, మీ సంగతి చూస్తాం.’ అని రాహుల్‌ గాంధీ చెప్పారు.

బాధ్యతారహితం.. పట్టించుకోవద్దు : ఈసీ

అయితే.. రాహుల్‌ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. అవన్నీ ఆధార రహిత ఆరోపణలేనని పేర్కొన్నది. ఈసీపై రోజువారీ చేస్తున్న విమర్శల్లో భాగమేనని తేలిగ్గా తీసుకుంది. ఇటువంటి బాధ్యతారహితమైన ప్రకటనలను పట్టించుకోవద్దని ఎన్నికల సంఘం అధికారులకు సూచించింది. కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు సైతం రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌ది ప్రమాదకరమైన ప్రవర్తనగా అభివర్ణించారు. ఈసీ వంటి రాజ్యంగ సంస్థలపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ‘వాళ్లు గెలిస్తే అంతా ఓకే.. కానీ.. ఓడిపోతే.. ఎన్నికల కమిషన్‌ను నిందిస్తారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే కుట్రే ఇది’ అని రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.