రిజర్వాయర్లలో అడుగంటుతున్న నీటి నిల్వలు.. దక్షిణాదిలో మరింత ప్రమాదకరం

- 150 జలాశయాల్లో గతేడాది కంటే 19 శాతం తక్కువ నీరు
- ఈశాన్య రుతుపవనాల పైనే ఆశలన్నీ
విధాత: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్ల లో నీరు అడుగంటి పోతోంది. దేశంలోని వివిధ రిజర్వాయర్ల నీటి నిల్వలను పరిశీలించగా ముఖ్యమైన 150 జలాశయాల్లో గతేడాది ఉన్న ఈ ఏడాది 19 శాతం తక్కువ నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. నైరుతి రుతుపవనాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం.. ఈశాన్య రుతుపవనాల జాడ లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గత 10 ఏళ్ల నీటి నిల్వల లెక్కలను తీసుకుంటే.. ఈ ఏడాది 8 శాతం తక్కువగా జలాశయాలు నీటిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రభావం సాగుపై అంత ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ఎక్కడికక్కడ నీటి పారుదల వ్యవస్థ బలంగా ఉండటంతో ప్రస్తుత సీజన్లో రైతులు నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రమాదం కాస్త తక్కువగా ఉండనుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఉత్తర భారతంలో 10, తూర్పున 23, పశ్చిమాన 49, మధ్య భారతంలో 26 రిజర్వాయర్లలో గతేడాది కంటే కాస్త తక్కువగా నీటి నిల్వలు ఉన్నాయి. దక్షిణ భారతంలో మాత్రం పరిస్థితి కాస్త విషమంగా ఉంది. ఇక్కడి 42 రిజర్వాయర్లలో గతేడాది కంటే 44 శాతం నీటి నిల్వలు నమోదు కాగా.. 10 ఏళ్ల సగటుతో పోలిస్తే 26 శాతం తరుగుదల నమోదైంది.
ప్రస్తుతం వాటి సామర్థ్యంలో 48 శాతం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండటం గమనార్హం. కొన్నిరోజుల్లో రానున్న ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షాలు పడితే ఇవి ప్రమాదకర స్థితి నుంచి బయటపడే అవకాశముంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం.. దేశంలోని మొత్తం జలాశయాల్లో గురువారం నాటికి 129.63 బిలియన్ క్యూబిక్ మీటర్లు నీరు ఉండగా.. ఇది వాటి మొత్తం సామర్థ్యంలో 74 శాతానికి సమానం.
గతేడాది ఇదే సమయం నాటికి ఆ మొత్తం 160.40 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉండగా.. 10 ఏళ్ల సగటు 140.28 బిలియన్ క్యూబిక్ మీటర్లు గా ఉంది. ఎలా చూసుకున్నా ఈ ఏడాది నీటి నిల్వలు ప్రమాదకరస్థాయికి పడిపోయాయి. దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో నీటి ఎద్దడి కొనసాగే అవకాశముంది. దేశ మొత్తం వర్షపాతంలో 75 శాతం ఈ నైరుతి రుతుపవనాల వల్లే వస్తాయని తెలిసిందే. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది సాధారణ సగటు కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది.