• Telugu News
  • /National

Road accident | రోడ్డు ప్రమాదంలో పెళ్లి కారు దగ్ధం.. వరుడు సహా నలుగురు సజీవదహనం

Road accident | పచ్చని పందిరి, మంగళవాయిద్యాలు, బంధుమిత్రుల కోలాహలంతో సందడిసందడిగా ఉన్న ఆ ఇంట్లో ఓ రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Reported by: Thyagi | జాతీయం | May 11, 2024, 9:47 am IST
Read Time: 4 mins
Road accident | రోడ్డు ప్రమాదంలో పెళ్లి కారు దగ్ధం.. వరుడు సహా నలుగురు సజీవదహనం

Road accident : పచ్చని పందిరి, మంగళవాయిద్యాలు, బంధుమిత్రుల కోలాహలంతో సందడిసందడిగా ఉన్న ఆ ఇంట్లో ఓ రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరుడు, అతని సోదరుడు, మేనల్లుడు, మరో ఇద్దరు బంధువులతో వెళ్తున్న కారును ఝాన్సీ-కాన్పూర్ హైవేపై వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని కారులో ఉన్న వరుడు సహా నలుగురు సజీవదహనమయ్యారు. డీసీఎం డ్రైవర్‌ పారిపోయాడు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝాన్సీ జిల్లా ఎరిచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాటి గ్రామ వాసి ఆకాష్‌కు మే 10న అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లి కొడుకు ఆకాశ్‌ తన సోదరుడు ఆశిశ్‌, మేనల్లుడు ఐషు (7) మరో ఇద్దరు బంధువులతో కలిపి కళ్యాణమండపానికి కారులో బయలుదేరాడు. కారు బడా గావ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పూర్ హైవేపై ఉన్న పారిచా ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. దాంతో కారులో, డీసీఎంలో మంటలు చెలరేగాయి. వెంటనే డీసీఎం డ్రైవర్ దూకి పారిపోయాడు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇంతలో వెనుక నుంచి మరో కారులో వచ్చిన ఆకాశ్‌ బంధువులు కారు అద్దాలను పగులగొట్టి ఇద్దరిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వరుడు ఆకాశ్‌, సోదరుడు ఆశిశ్‌, మేనల్లుడు ఐషు, కారు డ్రైవర్ మంటల్లోనే దహనమయ్యారు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేసి, మృతదేహాలను వెలికితీసి పోస్టుమర్టానికి పంపించారు.