విధాత : బహుభాష నటుడు సాయాజీ షిండే అందరికి సుపరిచితమే. తన నటనతోనే కాదు..నిజజీవితంలో తన ఆదర్శనీయ కార్యక్రమాలతో ఎందరో అభిమానులను సంపాదించుకుని రియల్ హీరోగా నిలిచారు. ప్రధానంగా తన తల్లి స్మారకార్థం ఆయన ఎంచుకున్న కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన తల్లి చనిపోయినప్పుడు ఆమె జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు సాయాజీ షిండే ఆమె బరువు ఉన్న పలు రకాల చెట్ల విత్తనాలు,మొక్కలు తీసుకుని మహారాష్ట్ర వ్యాప్తంగా వాటిని నాటించారు. దీంతో ఇప్పుడు మహారాష్ట్రలో 6.5 లక్షలకు పైగా మొక్కలు ఎదిగి సగర్వంగా షిండే తల్లి జ్ఞాపకాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. షిండే నాటించిన చెట్లలో రకరకాల పూలు, పండ్లు, నీడ, సువాసన చెట్లు ఉన్నాయి. వాటి ద్వారా తన తల్లి జ్ఞాపకాలు సజీవంగా నిలిచి ఉంటాయని షిండే బలంగా విశ్వసించారు. షిండే నిర్ణయంతో మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన లక్షల చెట్లతో పర్యావరణ హితంతో పాటు చెట్లపై ఆధారపడి మనుగడ సాగించే పశు, పక్ష్యాదులకు ఆశ్రయం, ఆహారంతో పాటు జీవ వైవిద్యం సిద్దిస్తుందని .. హ్యాట్సాఫ్! షిండేజీ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.
కష్టాల జీవితం నుంచి ఆదర్శనీయ స్ధాయికి..
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సాయాజీ, కష్టాలను దగ్గరగా చూస్తూ పెరిగారు. 1978లో ఒక డ్యామ్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం వారి కుటుంబ భూమిని తీసుకుంది, దానికి బదులుగా అతనికి నీటిపారుదల శాఖలో వాచ్‌మన్‌గా ఉద్యోగం ఇచ్చారు. కుటుంబానికి వాగ్దానం చేసిన ప్రత్యామ్నాయ భూమి 35 సంవత్సరాల తర్వాత మాత్రమే వారికి లభించింది. ఇప్పుడు ఆ భూమిని కూడా ఒక పెద్ద నర్సరీగా మార్చి, వేల సంఖ్యలో గ్రామాలకు పచ్చదనాన్ని పంచేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 48 విభిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లక్షలాది చెట్లలోనే తన తల్లి బతికి ఉందని నమ్ముతూ ఆయన చేస్తున్న ఈ పోరాటం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. షిండే వాచ్‌మన్‌గా పనిచేయడం నుండి ఒక లక్ష్యంతో నటుడిగా మారడం వరకు ఆయన జీవితం కష్టాల మధ్యనే కొనసాగిందంటారు.
5వేల మొక్కల లక్ష్యం రూ.6.50లక్షలకు చేరింది..
తన తల్లి జ్ఞాపకార్థం 5,000 చెట్లు నాటుతానని చెప్పిన సాయాజీ షిండే అంతకు మించి చేశారు. తన సొంత గ్రామంలో 2,000 చెట్లతో మొదలైన ‘సహ్యాద్రి దేవరాయ్’ అనే పర్యావరణ ఉద్యమం ఇప్పుడు ఒక దశాబ్ద కాలంగా సాగుతున్న ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. షిండే మొక్కులు నాటే ఉద్యమం గ్రామాలకు, సహ్యాద్రీ పర్వత ప్రాంతాలకు విస్తరించి ఏకంగా 6.50లక్షల మొక్కల ఎదుగుదలకు కారణమైంది. ఒకప్పుడు నిర్జీవంగా కనిపించిన పర్వతాలు ఇప్పుడు పూర్తిగా పచ్చగా మారాయి. 60 సంవత్సరాలకు పైగా బీడుగా ఉన్న ఒక గ్రామంలో నా ప్రయత్నంతో ఈ రోజు 16,000 చెట్లు ఉన్నాయని, అలాగే బీడు భూములతో కూడిన మరొక గ్రామంలో 1,000 చింత చెట్లను నాటితే, 15 సంవత్సరాల తర్వాత ఆ చెట్లు గ్రామస్తులకు దాదాపు కోటి రూపాయలను సంపాదించి పెట్టగలిగేలా ఏర్పాటు చేశానని షిండే వివరించారు.
దేవాలయాలలో పూజించే చెట్లను నాటించామని, భారతదేశ జాతీయ వృక్షమైన 200కు పైగా మర్రి చెట్లను నాటడానికి సాయాజీ స్వయంగా నిధులు సమకూర్చాడం జరిగిందని తెలిపారు. రోడ్ల విస్తరణలో భాగంగా నరికివేయడానికి సిద్ధంగా ఉన్న 200కు పైగా భారీ మర్రిచెట్లను అత్యాధునిక సాంకేతికతతో వేరే చోటుకు విజయవంతంగా రీ ప్లాంటేషన్ (మళ్లీ నాటడం) చేయించారు. ఈ చెట్లు ఇప్పుడు దాదాపు 200 జాతుల పక్షులు, కీటకాలకు ఆశ్రయమిస్తున్నాయని వివరించారు.
భవిష్యత్ తరాల కోసం చేసేదే స్మరణీయ ప్రతీక
తల్లిదండ్రుల పేరుతో విగ్రహాలు లేదా స్మారక చిహ్నాలకు బదులుగా షిండే మర్రి, రావి, చింత చెట్లను, ప్రకృతికి తిరిగి మేలు చేసే అడవులను ఎంచుకున్నారు. షిండే మహారాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షలకు పైగా దేశీయ చెట్లను పెంచి, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించి, జీవవైవిధ్యానికి తోడ్పడుతున్నారు. నిజమైన వారసత్వం అంటే మనం మన కోసం నిర్మించుకునేది కాదు, భవిష్యత్ తరాల కోసం మనం వదిలి వెళ్ళేదేనని ఇది గుర్తు చేస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
