మహాభారత యుద్ధంగా మార్చారు.. విడాకుల కేసుపై సుప్రీంకోర్టు అసహనం

దశాబ్ద కాలం సాగిన విడాకుల వివాదాన్ని సుప్రీంకోర్టు “మహాభారత యుద్ధం”గా అభివర్ణించి, ఆర్టికల్ 142 కింద రూ.5 కోట్ల భరణంతో విడాకులు మంజూరు చేసింది.

విడాకుల వివాదంలో దశాబ్ద కాలంగా భార్యాభర్తల మధ్య సాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మహాభారత యుద్ధంతో పోల్చడం ఆసక్తి రేపింది. తాజాగా ఓ జంటకు విడాకులిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ రకంగా తన అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సాధారణ చట్టాల పరిధిని దాటి పరిపూర్ణ న్యాయం చేయడానికి రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 142 అసాధారణ అధికారాన్ని ఉపయోగిస్తూ.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ విడాకుల వివాదంలో న్యాయవాదియైన భర్త తన అతి తెలివితో పదేళ్లలో భార్యపై 80 కేసులు పెట్టగా.. వాటిన్నింటినీ కొట్టేస్తూ వారికి ధర్మాసనం విడాకులు మంజూరు చేసింది.

కేసు పూర్వాపరాలు…

2010లో హిందూ సంప్రదాయం ప్రకారం ఓ జంటకు వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు పుట్టారు. అయితే 2016లో వీరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య చట్టపరమైన యుద్ధం మొదలైంది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భర్త.. తన భార్యపై, ఆమె కుటుంబ సభ్యులపై, చివరికి ఆమె తరపు న్యాయవాదులపై కూడా ఏకంగా 80కి పైగా కేసులు వేసి వేధించారని భార్య తరఫు లాయర్లు కోర్టుకు వివరించారు. భరణం చెల్లించకుండా తప్పించుకోవడానికి ఆయన పలు కంపెనీల డైరెక్టర్ పదవులకు కూడా రాజీనామా చేసి..న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడని ఆరోపించారు. భార్య తరపు వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి, భరణం, పిల్లల పోషణ, వ్యాజ్యపు ఖర్చులతో సహా రూ.5 కోట్ల ఏకమొత్తాన్ని చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

భర్తపై ధర్మాగ్రహం

ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. భర్త తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్త న్యాయవాది కావడంతో తన న్యాయ నైపుణ్యాన్ని ఉపయోగించి భార్యను వేధించే ఉద్దేశంతో భార్య, ఆమె కుటుంబ సభ్యులపై దాదాపుగా 80 కేసులు నమోదు చేయడంపై మండిపడింది. కేవలం ప్రతీకారేచ్ఛతోనే భార్య, ఆమె తరపువారిపై ఇన్ని కేసులు వేసి వివాదాన్ని సంక్లిష్టంగా మార్చాడని కోర్టు మందలించింది.

మరోవైపు భర్త తన వాదన వినిపిస్తూ.. భార్య తనపై పెట్టిన తప్పుడు కేసుల వల్ల తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని, అది తన వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసిందని పేర్కొన్నారు. భార్య అధిక సంపాదన కలిగిన వ్యక్తి అయినప్పటికీ.. భరణం కోసం తనను ఇబ్బంది పెడుతోందని వాదించారు. ఇప్పటికేరూ. 45 లక్షలు చెల్లించానని.. పిల్లలను తన నుంచి దూరం చేసిందని చెప్పుకొచ్చారు.

మహాభారత యుద్ధంలా మార్చేశారంటూ కోర్టు ఫైర్

భార్య విద్యావంతురాలైనంత మాత్రానా.. పిల్లల పట్ల తండ్రి తన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి వీళ్లేదు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపి భరణం చెల్లింపును తప్పించుకోవడానికి ప్రయత్నించాడని..కోర్టు దీనిని ‘‘కృత్రిమ కవచం’’గా అభివర్ణించింది. దాదాపు దశాబ్దకాలం పాటు సాగిన వైవాహిక వివాదాన్ని ‘‘మహాభారత యుద్ధం వంటిది’’గా అభివర్ణిస్తూ భార్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. “ఈ వివాహం అన్ని విధాలా చచ్చిపోయింది. ఇలాంటి స్థితిలో వైవాహిక బంధాన్ని కొనసాగించడం అసాధ్యంగా పేర్కొంది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శాశ్వతంగా జంటను వేరు చేస్తూ విడాకులు మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న హక్కును వినియోగించుకుంటూ తీర్పు వెలువరించింది. దశాబ్ద కాలంగా ఇరుపక్షాల మధ్య పెండింగ్‌లో ఉన్న 80కి పైగా సివిల్, క్రిమినల్ కేసులు, ఎఫ్ఐఆర్‌లు అన్నింటినీ కొట్టివేసింది. భరణంగా భార్యకు రూ.5 కోట్లు ఏకమొత్తంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. భవిష్యత్తులో భార్యపై గానీ, ఆమె కుటుంబ సభ్యులపై గానీ ఎలాంటి వ్యాజ్యాలు దాఖలు చేయబోనని పేర్కొంటూ ఒక అఫిడవిట్ సమర్పించాలని కూడా భర్తను ఆదేశించింది.

తల్లి సంరక్షణలో మైనర్ కుమారులు

ఇద్దరు మైనర్ కుమారుల శాశ్వత సంరక్షణ హక్కును తల్లికి అప్పగించగా.. తండ్రికి నెలవారీగా కలుసుకునే హక్కును కోర్టు కల్పించింది. భార్య ప్రస్తుతం తన మామకు చెందిన ముంబై ఫ్లాట్‌లో నివసిస్తోంది. రూ.5 కోట్ల భరణం అందిన వెంటనే రెండు వారాల్లోగా భర్త తండ్రికి చెందిన ఫ్లాట్‌ను భార్య ఖాళీ చేసి అప్పగించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో భార్య, ఆమె కుటుంబం లేదా ఆమె న్యాయవాదులపై ఎలాంటి కొత్త కేసులు పెట్టవద్దని భర్తను ఆదేశించింది. ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

అయితే కోర్టు అనుమతి లేకుండా పిల్లలను భార్య కలకత్తాకు తీసుకువెళ్లిందని.. దీంతో పిల్లల్ని సందర్శించే హక్కును కోల్పోయేలా చేసిందని ఆరోపిస్తూ ఈ విషయాన్ని పెద్దదిగా చెప్పేందుకు భర్త భర్త ప్రయత్నించాడు. దీనిపై కోర్టు ఆగ్రహంగా స్పందిస్తూ.. ‘‘ఒక తల్లికి సహజంగా తన పిల్లల సంరక్షణ, శ్రేయస్సు, సురక్షితమైన పెంపకమే ప్రధానమైన బాధ్యతగా పేర్కొంది. ఈ చర్యను భార్య దురుద్దేశానికి ఆపాదించలేం అని అభిప్రాయపడింది. పలు వివాదాలు, కేసులను పరిగణనలోకి తీసుకుంటే.. పిల్లల తరలింపు ఒక ఆత్మరక్షణ చర్య తప్ప మరేమీ కాదని స్పష్టమవుతోంది అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి :

Samantha | తృటిలో తప్పించుకున్నా… లేదంటే సావిత్రిలా అయ్యేదాన్ని: సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్
బిల్లులు చెల్తిస్తేనే..ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు సరఫరా !

Latest News