Shakti Dubey | మూడు సార్లు ప్రిలిమ్స్‌లో ఫెయిలై.. ఆరో ప్రయత్నంలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్.. శక్తి దూబే సక్సెస్ స్టోరీ ఇది..!
Shakti Dubey | శక్తి దూబే( Shakti Dubey ).. గత వారం రోజుల నుంచి దేశ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు ఇది. ఎందుకంటే ఆమె యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) 2024 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఐదు సార్లు ఫెయిలై.. ఆరో ప్రయత్నంలో ఆమె సివిల్స్( Civils 2024 ) సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
Shakti Dubey | ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్స్( UPSC Civils ) ఫలితాల్లో శక్తి దూబే ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఆమె ఈ విజయం సాధించేందుకు ఎంతో కష్టపడింది. తన సివిల్స్( Civils ) జర్నీలో ఎన్నో అపజయాలు ఎదురైనప్పటికీ కుంగిపోలేదు. ప్రతి ఫెయిల్యూర్‌ను విజయానికి సోపానాలుగా మార్చుకుంది. ప్రతి అపజయాన్ని ఒక సోపానంగా భావించి, కష్టాలను ఎదుర్కొని, నమ్మకంతో ముందుకు సాగింది. కఠోర శ్రమతో లక్ష్యాన్ని సాధించి.. విజయ తీరాలకు చేరింది. మరి శక్తి దూబే( Shakti Dubey ) విజయం వెనుకాల కష్టం గురించి తెలుసుకుందాం ఆమె మాటల్లోనే..
యూపీఎస్సీ సివిల్స్ 2024( UPSC Civils 2024 ) ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. వ్యూహాత్మక ప్రణాళికతో చదివాను. 2018లో యూపీఎస్సీ సివిల్స్‌కు ప్రిపేరవ్వడం ప్రారంభించాను. అప్పట్నుంచి మొన్నటి వరకు ఎక్కడ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తొలి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌లోనే ఫెయిల్ అయ్యాను. అయినా కూడా మానసికంగా కుంగిపోలేదు. మళ్లీ విజయం చేరాలనే దిశగా అడుగులు వేశాను. నాలుగో ప్రయత్నంలో ఇంటర్వ్యూ దాకా వెళ్లాను. కానీ లక్ష్యాన్ని ముద్దాడలేకపోయాను. ఐదో ప్రయత్నంలో అంటే గతేడాది.. 12 మార్కుల తేడాతో విజయం చేజారింది. అయినా నా సంకల్పాన్ని వదులుకోకుండా.. పట్టువదలకుండా మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టాను. ఆరో ప్రయత్నంలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించాను. తన యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో రోజుకు 8 నుంచి 10 గంటల పాటు చదివాను. ఇలా తన సివిల్స్ జర్నీ కొనసాగిందని శక్తి దూబే చెప్పుకొచ్చారు.
యూపీలోని బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు శక్తి దూబే. ఐఏఎస్ ఆఫీసర్‌గా మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపారు. మహిళల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌నే ఎంపిక చేసుకుంటానని, ఎందుకంటే తనకు యూపీ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు. తాను పుట్టి పెరిగింది కూడా యూపీలోనే అని తెలిపారు.
ఇక యూపీఎస్సీ సివిల్స్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు.. ఒక క్రమపద్ధతిలో చదవాలని సూచించారు. అప్పుడే విజయం సాధ్యమన్నారు. వీలైనన్నీ సార్లు మాక్ టెస్టులు రాయాలని, గతంలో ఏయే ప్రశ్నలు అడిగారో అనే అంశాలపై దృష్టి సారిస్తే విజయం సాధించొచ్చు అని శక్తి దూబే తెలిపారు. సివిల్స్‌కు ప్రిపేరయ్యే వారికి కుటుంబ సభ్యుల నుంచి సహకారం ఉండాలన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram