వీడూ ఓ తండ్రేనా..? కన్నకూతురిని కాటికి పంపాడు

రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి అయిన రాధికా యాదవ్​ను కన్నతండ్రే కాల్చిచంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల రాధిక తన ఇంటి వంటగదిలో అల్లం-వెల్లుల్లి మసాలా చేస్తుండగా తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో ఆమెను కాల్చిచంపాడు

వీడూ ఓ తండ్రేనా..? కన్నకూతురిని కాటికి పంపాడు
  • కూతురినే చంపిన కుటుంబ యజమాని
  • టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య వెనుక సంచలన సత్యాలు
  • గ్రామస్థుల సూటిపోటి మాటలతో ద్వేషం పెంచుకున్న తండ్రి
  • కూతురిని తానే చంపానని ఒప్పుకోలు

గురుగ్రామ్‌లో జరిగిన దారుణ కృత్యం దేశాన్ని కుదిపేసింది. తన కూతురు, రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి అయిన రాధికా యాదవ్​ను కన్నతండ్రే కాల్చిచంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల రాధిక తన ఇంటి వంటగదిలో అల్లం-వెల్లుల్లి మసాలా చేస్తుండగా తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో ఆమెను కాల్చిచంపాడు. ఈ హత్య గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో జరిగింది.

రాధిక బాబాయి కుల్దీప్ యాదవ్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, కాల్పుల శబ్దం విని పైకి వచ్చాడు. అప్పటికే రాధికా గుండెల్లో తూటాల రంధ్రాలతో రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే హాస్పిటల్‌కు తరలించినా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. “మా అన్నకూతురు రాధిక ఒక గొప్ప టెన్నిస్ క్రీడాకారిణి. చాలా ట్రోఫీలు గెలిచింది. కాని ఇంత దారుణంగా హత్య చేయబడుతుందని ఊహించలేకపోయాం ” అని కుల్దీప్ వేదన వ్యక్తం చేశారు.

ఎందుకు హత్య? విస్తుపోయే కారణాలు..

పోలీసులకు ఇచ్చిన స్టేట్​మెంట్​లో దీపక్ యాదవ్ చెప్పిన విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. “వజీరాబాద్‌లో మా గ్రామానికి వెళ్లినప్పుడు గ్రామస్తులు నన్ను హేళన చేసేవారు. ‘కూతురు సంపాదించే డబ్బుతో నువ్వేం చేస్తున్నావ్’ అని నన్ను అవమానించేవారు. అంతే కాదు, నీ కూతురు ఒక టెన్నిస్​ అకాడమీ నడుపుతోంది అని మహిళలను చిన్నచూపు చూసేవారు. ఇది నా పరువుప్రతిష్టలను దెబ్బతీసింది” అని ఆయన అన్నట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, రాధిక హత్యకు ప్రేమ వ్యవహారం కూడా కారణం కావచ్చని కొంతమంది భావిస్తున్నారు. ఓ యువకుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు తన సోషల్​ మీడియా ఖాతాల్లో ఉండటం దీనికి ఊతమిస్తోంది.

రాధికా ఓ భుజం గాయం తర్వాత తాత్కాలికంగా ఆట ఆపి, టెన్నిస్ అకాడమీ ప్రారంభించింది. చిన్నారులకు శిక్షణ ఇస్తూ జీవనం సాగిస్తోంది. అదే ఆమె జీవితాన్ని అంతంచేసేందుకు కారణమైంది. తండ్రి గౌరవాన్ని క్షీణింపజేస్తుందన్న అసూయ, మూర్ఖపు గర్వంతో  దీపక్​ ఈ అమానుష చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలంలో 0.32 బోర్ లైసెన్స్‌డ్ రివాల్వర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు ఖాళీ బుల్లెట్లు, ఒక లైవ్ కార్ట్రిడ్జ్, రక్తపు మరకలు, వేలిముద్రలు వంటి కీలక ఆధారాలు సేకరించబడ్డాయి. ఆర్మ్స్ యాక్ట్ మరియు BNS 103(1), 27(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అసలు రోజు  ఏం జరిగింది?

ఆ హత్య జరిగిన సమయంలో ఇంటి మొదటి అంతస్థులో రాధిక, ఆమె తల్లి మంజు యాదవ్, మరియు తండ్రి దీపక్ మాత్రమే ఉన్నారు. తమ్ముడు ధీరజ్ ఆ సమయంలో బయటకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. మంజు యాదవ్ అనారోగ్యంతో మరో గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా తుపాకీ శబ్దాలు మాత్రమే వినిపించాయని తెలిపారు. ఈ ఘటనపై రాధిక మామ కుల్దీప్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, దీపక్​ అన్నయ్య విజయ్​ యాదవ్​ పోలీస్​ స్టేషన్​లో ఉన్నప్పుడు, దీపక్​ పోలీసులతో తన ఎఫ్​ఐఆర్​ను బలంగా రాయండి. నాకు ఉరిశిక్ష తప్పకుండా పడేలా ఉండాలి. కన్యాహత్యకు పాల్పడ్డందుకు తనకీ శిక్ష పడాల్సిందేనని పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లుగా విజయ్​ తెలిపాడు. జరిగింది హేయమైన నేరమనీ, తన తమ్ముడికి ఏ శిక్ష విధించినా తప్పులేదని ఆయన తెలిపాడు.

పితృస్వామ్య భావజాలం మహిళల స్వయంసమృద్ధిపై దాడి

ఈ సంఘటనలో ఒక ప్రతిభావంతమైన యువతి తన కుటుంబంలోనే పుట్టిన పితృస్వామ్య రాక్షసానికి బలైంది. ఇది వ్యక్తిగత విషాదం మాత్రమే కాకుండా, సమాజం మొత్తానికి వర్తించే ప్రశ్న – ఒక యువతి తన ఇష్టాయిష్టాలకనుగుణంగా ఎదిగే స్వతంత్రత లేనప్పుడు, మనం దేన్ని చూసి గర్వపడాలంటూ ప్రజలు రకరకాల మాధ్యమాల ద్వారా ప్రశ్నలు సంధిస్తున్నారు.  ఈ ఘటన దేశవ్యాప్తంగా మహిళా ఉద్యమాల్లో, యువక్రీడాకారుల్లో తీవ్ర స్థాయిలో ఆవేదనను కలిగించింది. రాధిక పేరు  సమాజంలో ఇంకా అంతరించని పురుషాధిక్యానికి మరో ఉదాహరణగా మిగిలిపోతుంది.