రాహుల్‌ ‘హిందూ’ వ్యాఖ్యలపై శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి స్పందన ఇదే

హిందూత్వం పేరుతో హింసకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్‌ మఠ్‌ అధిపతి, శంకరాచార్య ఆవిముక్తేశ్వరానంద్‌ సర్వస్వతి సమర్థించారు

రాహుల్‌ ‘హిందూ’ వ్యాఖ్యలపై శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి స్పందన ఇదే

న్యూఢిల్లీ: హిందూత్వం పేరుతో హింసకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలను ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్‌ మఠ్‌ అధిపతి, శంకరాచార్య ఆవిముక్తేశ్వరానంద్‌ సర్వస్వతి సమర్థించారు. హిందూ మతం అంటే భయం, విద్వేషం, అసత్యాలను వ్యాప్తి చేయడం కాదని అన్నారు. ‘హిందూ మతానికి వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారని విన్న తర్వాత నేను ఆ మొత్తం వీడియోను చూశాను. ఆయన ఏదీ తప్పుగా మాట్లాడలేదని నాకు అర్థమైంది. హిందూ మతంలో హింసకు స్థానం లేదని రాహుల్‌ గాంధీ చెప్పింది ముమ్మాటికీ సరైనదే’ ’ అని ఆయన చెప్పారు.

ఉపన్యాసాలను ఎడిట్‌ చేయడం ద్వారా అర్థసత్యాలను వ్యాప్తి చేయడం నేరం. వారు వార్తాపత్రికకు చెందినా, టెలివిజన్‌ చానల్‌కు చెందినా.. అటువంటివారిని శిక్షించాలి’ అని ఆవిముక్తేశ్వరానంద్‌ సర్వస్వతి అన్నారు. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గురించే కానీ హిందూ మతం గురించి కాదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గురించేనని, మతం ముసుగులో వాళ్లు హింసకు పాల్పడుతున్నారని తర్వాత రాహుల్‌గాంధీ స్పష్టత కూడా ఇచ్చారు’ అని ఆయన తెలిపారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జూలై 2న లోక్‌సభలో చర్చలో పాల్గొన్న రాహుల్‌గాంధీ.. ‘ఏదో ఒక మతం మాత్రమే ధైర్యం గురించి మాట్లాడటం లేదు. వాస్తవానికి అన్ని మతాలు ధైర్యం గురించి చెబుతున్నాయి. శివుడు అభయ ముద్రను చూపిస్తూ భయపడకండి.. భయపెట్టకండి అంటూ అహింస గురించి చెప్పారు’ అని బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ మాత్రమే హిందూ మతానికి ఏకైక ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు అధికార బీజేపీ సభ్యుల ఆగ్రహానికి కారణమయ్యాయి. రాహుల్‌ గాంధీ యావత్‌ హిందువులను విమర్శించారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన రాహుల్‌గాంధీ తాను బీజేపీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. ‘బీజేపీ, ఆరెస్సెస్‌, లేదా ప్రధాని మోదీ మాత్రమే హిందువులకు ప్రతినిధులు కాదు’ అని తేల్చి చెప్పారు.