నీట్ పేపర్ లీక్ దోషులపై చర్యలకు డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన 26రోజుల నిరాహార దీక్షకు తెరపడింది. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ అనంతరం మాట్లాడుతూ దేశంలో హింస చెలరేగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానని, పార్లమెంటులో విద్యా వ్యవస్థపై చర్చ, విద్యార్ధులపై కేసులు ఉండవన్న హామీలో దీక్ష విరమించాని, ఎవరూ హింసకు దిగరాదని కోరారు.
వాంగ్ చుక్ త్వరగా కోలుకోవాలి : ప్రధాని
నిరాహార దీక్ష విరమించిన వాంగ్ చుక్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కోరారు. సోనమ్ జీ.. దైనందిన జీవితంలో వైద్యుల సలహాలను పాటించి, వీలైనంత త్వరగా పూర్వపు బరువును తిరిగి పొందాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మంచి ఆరోగ్యం కోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అనంతరం ప్రధాని మోదీ పేపర్ల లీకేజీపై స్వయంగా అర్ధరాత్రి జాతిని ఉద్దేశించి ఓ వీడియో పోస్టు చేశారు. పేపర్ల లీకేజీలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై ఫాస్ట్‌కోర్టులు ఏర్పాటుచేస్తామని, నిందితులను శిక్షిస్తామని వీడియో సందేశం పంపారు.
విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని ప్రకటించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా ఆందోళనలు : సీజేపీ
నీట్ నిరసనల్లో భాగంగా సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన దీక్షను విరమించడం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. 26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్‌కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. ప్రధానీ వీడియో సందేశంలో తాము చూశామని, అయితే తమ డిమాండ్లలో ప్రధానమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రధాన్‌ను తొలగించడమే కేంద్రం తీసుకోగల కఠినచర్య అని..అప్పటికదాకా మా నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు.
మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్
ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.మిస్టర్ మోదీ..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. అర్ధరాత్రి దయనీయ పరిస్థితిలో వీడియో విడుదలు చేసి విద్యార్ధుల తెలివితేటలను అవమానించకండని చురకలేశారు ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందేనని, విద్యార్ధులను కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, మోదీ విద్యార్ధులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ పునరుద్ఘాటించారు.
పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలు
పరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్‌ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది.
ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్‌కుమార్‌ను నియమించింది.
కేంద్రంతో చర్చలకు సీజేపీ గ్రీన్‌సిగ్నల్.. నేడు చర్చలు
పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని సీజేపీ నాయకత్వం ప్రకటించడంతో..కేంద్ర ప్రభుత్వం వెంటనే తటస్థ వేదికలోనే సమావేశం నిర్వహించాలని కోరింది. సీజేపీ డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించినట్లు పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఇరు పక్షాల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిపారు.
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026
