జార్ఖండ్‌ సీఎంగా మళ్లీ సొరేన్‌ .. ముఖ్యమంత్రి పదవికి చంపై రాజీనామా

జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ మరోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. రాంచీలోని ముఖ్యమంత్రి చంపై సొరేన్‌ నివాసంలో మంగళవారం జేఎంఎం నాయకత్వంలోని కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం

జార్ఖండ్‌ సీఎంగా మళ్లీ సొరేన్‌ .. ముఖ్యమంత్రి పదవికి చంపై రాజీనామా

గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు రాజీనామా పత్రం అందజేత
రాంచీ: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ మరోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమయ్యింది. ముఖ్యమంత్రి పదవికి చంపై సొరేన్‌ బుధవారం రాత్రి రాజీనామా చేశారు. గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అంతకు ముంద హిందీలో ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టిన చంపై సొరేన్‌.. ‘నాయకత్వం మారినప్పుడు నాకు బాధ్యతలు ఇచ్చారు. జరిగిన పరిణామాలు మీకు తెలుసు. హేమంత్‌ సొరేన్‌ తిరిగి వచ్చినప్పుడు ఆయనను నేతగా ఎన్నుకున్నాం. నేను రాజీనామా చేశారు. సంకీర్ణం తీసుకున్న నిర్ణయాన్ని నేను అనుసరించాను’ అని పేర్కొన్నారు.
మంగళవారం రాత్రి రాంచీలోని ముఖ్యమంత్రి చంపై సొరేన్‌ నివాసంలో జేఎంఎం నాయకత్వంలోని కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సొరేన్‌ భార్య కల్పన, సోదరుడు, మంత్రి బసంత్‌, కాంగ్రెస్‌ జార్ఖండ్‌ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గులాం అహ్మద్‌ మీర్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకూర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కల్పన ఇటీవలే ఉప ఎన్నికలో గండే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ స్థానం నుంచి ఆమె పోటీ చేసేందుకు వీలుగా సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేశారు.
భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రాంచీ హైకోర్టు ఇటీవల బెయిల్‌ ఇవ్వడంతో జూన్‌ 28వ తేదీన హేమంత్‌ సొరేన్‌ జైలు నుంచి విడులైన సంగతి తెలిసిందే. తన అరెస్టుకు ముందు జనవరి 31న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన సొరేన్‌ అరెస్టు నేపథ్యంలో అదే రోజు జార్ఖండ్‌ 12వ ముఖ్యమంత్రిగా చంపై సొరేన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు మరో ఇద్దరు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. తదుపరి ఫిబ్రవరి 16న మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మంత్రి మండలిలోకి తీసుకున్నారు. వీరిలో జూన్‌ 11న ఈడీ అరెస్టు నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి అలంగిర్‌ అల్మా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన చంపై సొరేన్‌కు జేఎంఎం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగించడంతోపాటు.. ఇండియా కూటమి (యూపీఏ) సమన్వయ కమిటీ చైర్మన్‌ పదవిని కూడా ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జేఎంఎం కూటమి బలం 45కు తగ్గింది. ప్రస్తుతం జేఎంఎం నుంచి 27 మంది, కాంగ్రెస్‌ నుంచి 17, ఆర్జేడీ నుంచి ఒకరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మొత్తం 81 మంది సభ్యుల సభలో ప్రస్తుతం మొత్తం 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారి బహిరంగ సభలో మాట్లాడిన హేమంత్‌ సొరేన్‌.. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. దేశం నుంచి బీజేపీని ఇండియా కూటమి తరిమికొడుతుందన్న హేమంత్‌ సొరేన్‌.. భూస్వామ్య శక్తులపై తిరుగుబాటును ప్రకటించారు.