Man Stuck in Lift | 42 గంటల పాటు లిఫ్ట్‌లోనే.. దాహంగా ఉండడంతో మూత్రాన్ని తాగిన వ్యక్తి
Man Stuck in Lift | ఓ వ్యక్తి మెడికల్ చెకప్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఇక పైఅంతస్తుల్లో ఉన్న డాక్టర్‌ను కలిసేందుకు లిఫ్ట్ ఎక్కాడు. కానీ అది ప్రమాదవశాత్తు కుప్పకూలింది. దీంతో అతని ఫోన్ కూడా పగిలిపోయింది. 42 గంటల పాటు లిఫ్ట్‌లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు దాహం వేయడంతో.. తన మూత్రాన్ని లిఫ్ట్ మూలలో విసర్జించి తాగేశాడు.

Man Stuck in Lift | తిరువనంతపురం : ఓ వ్యక్తి మెడికల్ చెకప్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. ఇక పైఅంతస్తుల్లో ఉన్న డాక్టర్‌ను కలిసేందుకు లిఫ్ట్ ఎక్కాడు. కానీ అది ప్రమాదవశాత్తు కుప్పకూలింది. దీంతో అతని ఫోన్ కూడా పగిలిపోయింది. 42 గంటల పాటు లిఫ్ట్‌లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు దాహం వేయడంతో.. తన మూత్రాన్ని లిఫ్ట్ మూలలో విసర్జించి తాగేశాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో శనివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని కేరళ అసెంబ్లీ అధికారిక క్వార్టర్స్‌లో రవీంద్రన్ నాయర్(59) అనే వ్యక్తి ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు బ్యాక్ పెయిన్ ఉండడంతో శనివారం మధ్యాహ్నం తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు వెళ్లాడు. ఆర్థోపెడిక్ డాక్టర్‌ను కలిసేందుకు ఆస్పత్రిలో ఉన్న లిఫ్ట్‌ను ఎక్కాడు. కానీ అది కుప్పకూలిపోయింది. ఈ క్రమంలో నాయర్ ఫోన్ కూడా పగిలిపోయింది. ఇక ప్రతి రెండు మూడు నిమిషాలకో సారి లిఫ్ట్‌లో ఉన్న ఎమర్జెన్సీ బెల్‌ను కూడా మోగిస్తున్నాడు. కానీ ఎవరూ స్పందించడం లేదు. ఫోన్ చేద్దామంటే తన ఫోన్ పూర్తిగా పగిలిపోయింది. లిఫ్ట్‌కు ఒక చిన్న రంధ్రం ఉండడంతో దాంట్లో నుంచి గాలి రావడంతో.. శ్వాస తీసుకునేందుకు ఎలాంటి సమస్య లేకుండా పోయింది. ఇక లిఫ్ట్‌లోనే మలమూత్ర విసర్జన చేశాడు. దాహంగా ఉండడంతో గొంతు తడుపుకునేందుకు తన మూత్రాన్ని తానే తాగేశాడు. ఇలా రెండు రోజుల పాటు లిఫ్ట్‌లోనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకుని ఉన్నాడు.
సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఒకరు లిఫ్ట్‌లను చెక్ చేస్తుండగా, నాయర్ లిఫ్ట్‌లో ఉండిపోయిన ఘటన వెలుగు చూసింది. తీవ్ర అస్వస్థతకు గురైన నాయర్‌ను చూసి సిబ్బంది షాక్ అయ్యారు. ఆయనను అదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నాయర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
నాన్న ఆస్పత్రికి వెళ్లినట్లు మాకు తెలియదు : కుమారుడు హరి శంకర్
నాన్న అధికారిక పనుల మీద కొన్ని సందర్భాల్లో ఇంటికి ఆలస్యంగా వస్తుంటారు. శనివారం రాత్రికి కూడా ఇంటికి రాకపోయే సరికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాం. నాన్న ఆస్పత్రికి వెళ్లిన విషయం మాకు తెలియదు. నాన్న మంచితనమే ఆయనను ప్రాణాలతో కాపాడింది. లిఫ్ట్ పని చేయట్లేదని కనీసం బోర్డు ఉంచకపోవడం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యానికి కారణమన్నారు. ఎమర్జెన్సీ బెల్స్ పని చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.