Supreme Court । ప్రార్థనాస్థలాలపై తదుపరి విచారణ వరకూ పిటిషన్లు స్వీకరించొద్దు.. ఆదేశాలూ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రార్థనా స్థలాల టైటిల్‌, యాజమాన్య హక్కులను సవాలు చేసే పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నది. అటువంటి పిటిషన్లపై దేశవ్యాప్తంగా ఉన్న సివిల్‌ కోర్టులు చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. తదుపరి విచారణ వరకూ సివిల్‌ కోర్టులు తాజా సూట్లను రిజిస్టర్‌ చేయడం లేదా ప్రొసిడింగ్స్‌ ఆదేశాలు ఇవ్వడం చేయరాదని స్పష్టం చేసింది.

Supreme Court । ప్రార్థనాస్థలాలపై తదుపరి విచారణ వరకూ పిటిషన్లు స్వీకరించొద్దు.. ఆదేశాలూ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court । ప్రార్థనా స్థలాల టైటిల్‌, యాజమాన్య హక్కులను సవాలు చేసే పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నది. అటువంటి పిటిషన్లపై దేశవ్యాప్తంగా ఉన్న సివిల్‌ కోర్టులు చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. తదుపరి విచారణ వరకూ సివిల్‌ కోర్టులు తాజా సూట్లను రిజిస్టర్‌ చేయడం లేదా ప్రొసిడింగ్స్‌ ఆదేశాలు ఇవ్వడం చేయరాదని స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న సూట్ల విషయంలోనూ ఎలాంటి మధ్యంతర లేదా తుది ఉత్తర్వులు లేదా సర్వేకు అనుమతిస్తూ ఆదేశాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. వారణాసిలోని జ్ఞానవాపి వివాదం, మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయం సహా ఇతర అన్ని కేసులూ ఈ ఉత్తర్వుల పరిధిలోకి వస్తాయి. దాదాపు పది ప్రాంతాల్లోని ప్రార్థనాస్థలాలపై సూట్లు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం గురువారం విచారించింది. ఈ విషయంలో నాలుగు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నిర్దేశించింది.

అప్పటికి లిటిగేషన్‌లో ఉన్న అయోధ్య మినహా అన్ని ప్రార్థనా స్థలాల స్వభావం విషయంలో 1947, ఆగస్ట్‌ 15 నాటి యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం , 1991 పేర్కొంటున్నది. అయోధ్య రామ జన్మభూమి వివాదం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఈ చట్టాన్ని పీవీ నర్సింహారావు నేతృత్వంలోని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొనివచ్చింది. వారణాసిలో కాశీ విశ్వనాథ్‌ ఆలయం- జ్ఞాన్‌వాపి మసీదు వివాదం, మథురలో కృష్ణ జన్మభూమి ఆలయం- షాహీ ఈద్గా మసీదు కాంప్లెక్‌ వివాదం కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలని హిందూ గ్రూపులు డిమాండ్‌ చేస్తున్నాయి. 2020 జూన్‌లో లక్నోకు చెందిన విశ్వ భద్రద పూజారి పురోహిత్‌ మహాసంఘ్‌ ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తదుపరి కొద్ది రోజులకు ఈ అంశంలో తమనూ పార్టీగా చేర్చాలని జమా ఏ హింద్‌ కోర్టు అనుమతిని కోరింది. ఈ విషయంలో నోటీసు జారీ చేసినా ముస్లిం సమాజంలో వారి ప్రార్థనా స్థలాల విషయంలో ప్రత్యేకించి అయోధ్య తీర్పు నేపథ్యంలో మనసులో భయాన్ని సృష్టిస్తుందని కోర్టుకు తెలిపింది. అది దేశ లౌకిక స్వభావాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.