SC Relief For Women Journalists | మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట

పల్స్ న్యూస్ ఎండీ రేవతి, రిపోర్టర్ తన్వి యాదవ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోలీస్ కస్టడీకి అనుమతించిన తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బెయిల్‌పై ఉన్న వారిని కస్టడీకి ఇవ్వడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

SC Relief For Women Journalists | మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట

విధాత, హైదరాబాద్ : మహిళా జర్నలిస్టులు పల్స్‌ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేవతి, , న్యూస్‌ రిపోర్టర్‌ బండి సంధ్యా అలియాస్ తన్వి యాదవ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రేవతి, తన్వి యాదవ్‌లను పోలీస్ కస్టడీకి అనుమతించిన తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బెయిల్‌పై ఉన్న ఇద్దరిని పోలీస్ కస్టడీకి హైకోర్టు ఎలా అనుమతిస్తుందని మహిళా జర్నలిస్టుల తరపు లాయర్ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

జస్టిస్‌ సందీప్ మెహతా, విక్రమ్ నాథ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, మహిళా జర్నలిస్టులు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్రం సమాధానం ఇవ్వాలని సూచించింది. హైకోర్టు తాత్కాలికంగా ఇచ్చిన ఆదేశాల వల్ల తమను మళ్లీ అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని, తక్షణ జోక్యం అవసరమని రేవతి, తాన్వీ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం మార్చి 12న ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసింది. వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీపై సోషల్‌ మీడియాలో దూషణాత్మక వ్యాఖ్యలు ప్రచురించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, హింసకు ప్రేరేపించే కంటెంట్‌ పోస్ట్‌ చేయడం వంటి ఆరోపణలు నమోదయ్యాయి. పల్స్‌ న్యూస్‌ ఛానల్‌లో తన్వీ యాదవ్‌ చేసిన ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉండటంతో, ఆ వీడియో వైరల్‌ అయింది. తర్వాత ఆ వీడియోను రేవతి తన సోషల్‌ మీడియా పేజీలో కూడా పోస్ట్‌ చేయడంతో వివాదం మరింత పెరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం వీరిని మళ్లీ అరెస్టు చేయడానికి పూనుకోవడంతో జర్నలిస్టులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు స్థానిక కోర్టు ఇచ్చిన కస్టడీ ఆదేశాలను సమర్థించింది. దీంతో జర్నలిస్టులు తమ హక్కులను రక్షించమని సుప్రీం కోర్టును ఆశ్రయించాగా అత్యున్నత న్యాయస్థానం పై ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు అభిప్రాయం

సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించి, జర్నలిస్టుల మళ్లీ అరెస్టును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కేసులో తదుపరి విచారణకు రాష్ట్ర ప్రభుత్వ సమాధానం అనంతరం తేదీ నిర్ణయించనున్నట్లు కోర్టు పేర్కొంది.

ఈ తీర్పు జర్నలిస్టుల సంఘాల్లో ఉపశమనం కలిగించింది.
“మీడియా స్వేచ్ఛను రక్షించడంలో ఇది ఒక ముందడుగు. రాజకీయ వ్యాఖ్యల కారణంగా జర్నలిస్టులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం” అని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ నేతలు తెలిపారు.