Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఇంట్లో తీవ్ర విషాదం..
Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Tamilisai Soundararajan )ఇంట్లో విషాదం నెలకొంది. తమిళిసై తండ్రి అనంతన్( Ananthan )(93) చెన్నై( Chennai )లో కన్నుమూశారు.

Tamilisai Soundararajan | చెన్నై : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్( Tamilisai Soundararajan )ఇంట్లో విషాదం నెలకొంది. తమిళిసై తండ్రి కుమారి అనంతన్( Kumari Ananthan )(93) చెన్నై( Chennai )లో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనంతన్.. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం అనంతన్ భౌతికకాయాన్ని తమిళిసై నివాసం వద్ద ఉంచారు.
అనంతన్ మృతిపట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు పలువురు సీనియర్లు, బీజేపీ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఎవరీ కుమారి అనంతన్..?
కుమారి అనంతన్ 1933, మార్చి 19న కన్యాకుమారి జిల్లాలోని అగస్తీశ్వరంలో జన్మించారు. తమిళ భాష అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. పార్లమెంట్‌లో తమిళంలో మాట్లాడేందుకు పోరాటం చేసి విజయం సాధించారు. భాష, సాంస్కృతిక గుర్తింపును ప్రోత్సహించేందుకు ఆయన నిర్విరామంగా కృషి చేశారు.
కాంగ్రెస్ పార్టీలో అనంతన్ ఒక గొప్ప నాయకుడిగా ఎదిగి, ప్రజల మన్ననలు పొందారు. ఒక సామాన్యుడిలా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1977లో తొలిసారిగా నాగర్‌కోయిల్ నియోజకవర్గం పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడు అసెంబ్లీకి ఐదు సార్లు ఎన్నికయ్యారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్‌గా సేవలందించారు.