Bihar | ప్రత్యేక హోదాపై కేంద్రం లోక్‌సభలో కీలక ప్రకటన..

ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీయూ సహా ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, బీజేపీడీ తమ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాయి.

Bihar | ప్రత్యేక హోదాపై కేంద్రం లోక్‌సభలో కీలక ప్రకటన..

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీయూ సహా ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, బీజేపీడీ తమ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాయి. ఇదే విషయంలో ఆర్జేడీ ఎంపీ రాంప్రీత్‌ మండల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 2012లో ఏర్పాటు చేసిన అంతర్‌ మంత్రిత్వ గ్రూపు నివేదికను ప్రస్తావిస్తూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లోక్‌సభ వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

గతంలో నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎన్డీసీ) కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేదని పంకజ్‌ చౌదరి తెలిపారు. అందుకోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకునేదని పేర్కొన్నారు. కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, తక్కువ జనసాంద్రత లేదా గిరిజనులు అధిక సంఖ్యలో నివసించడం, పొరుగు దేశాలతో వ్యూహాత్మక సరిహద్దులు కలిగి ఉండటం, ఆర్థిక, పారిశ్రామిక వెనుకబాటుతనం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీంగా ఉండటం వంటి అంశాలను ప్రత్యేక హోదా కోసం పరిగణనలోకి తీసుకునేవారని తెలిపారు.

‘గతంలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడమనే అంశంపై అంతర్‌ మంత్రిత్వ గ్రూపు 2012 మార్చి 30న ఒక నివేదిక సమర్పించింది. ఎన్డీసీ ప్రమాణాలను ఆధారం చేసుకుని బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో నిర్ణయం తీసుకోలేదు’ అని మంత్రి తన సమాధానంలో తెలిపారు. అంతర్ మంత్రిత్వ గ్రూపు నివేదిక సమర్పించిన సమయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో జేడీయూ సీనియర్‌ నేత సంజయ్‌ కుమార్‌ ఝా బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఎన్డీయేలో మరో భాగస్వామ్య పక్షమైన లోక్‌ జనశక్తి పార్టీ (రాంవిలాస్‌)తోపాటు ప్రతిపక్ష ఆర్జేడీ కూడా ప్రత్యేక హోదాకు డిమాండ్‌ చేశాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని జేడీయూ కేంద్రానికి తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ, బీజేడీ కూడా అఖిలపక్షంలో డిమాండ్‌ చేశాయి.
ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీల్లేదని 14 ఆర్థిక సంఘం పేర్కొన్న విషయాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రత్యేక హోదా కల్పిస్తే.. పన్ను మినహాయింపులు, కేంద్ర నిధుల్లో భారీ వాటా తదితరాలు వర్తిస్తాయి.