మార్పు కోరుతున్న మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మనోగతం ఎలా ఉన్నదనే విషయంపై ఎన్‌డీటీవీ-సీఎస్‌డీఎస్ లోక్‌నీతి ప్రీపోల్ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మనోగతం ఎలా ఉన్నదనే విషయంపై ఎన్‌డీటీవీ-సీఎస్‌డీఎస్ లోక్‌నీతి ప్రీపోల్ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బీజేపీ అధిష్టానం ఒకటి తలిస్తే అక్కడి ప్రజల ఆలోచనలు మరో విధంగా ఉన్నట్టు స్పష్టమైంది. 2018లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు. కమల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ మూడున్నరేళ్ల పాలన పట్ల అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారంటే శివరాజ్‌కు 36 శాతం, కమల్‌నాథ్‌కు 34 శాతం, జ్యోతిరాదిత్య సింధియాకు 4 శాతం, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 2 శాతం, కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఓకే అని 6 శాతం, బీజేపీ నుంచి ఎవరైనా ఒకే అని 4 శాతం మంది మద్దతు తెలిపారు.
ఈ విషయంలో కమల్‌నాథ్ కంటే శివరాజ్‌సింగ్ కొద్దిగా ముందున్నారు. అయితే ఆ పార్టీ తరఫున ఎన్నికల పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో కాదు, రెండో జాబితాలోనూ ఆయన పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించని సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఈసారి పోటీ చేయకపోవచ్చనే వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు మూడో జాబితాలో ఆయన పేరు ప్రకటించింది. కమల్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన జ్యోతిరాదిత్యను, ఒకవేళ అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్ర సింగ్ తోమర్ సీఎం అవుతారనే ప్రచారం జరుగుతున్నది. అయితే వీళ్లిద్దరిని అక్కడ ప్రజలు కోరుకోవడం లేదని తేలింది. కమల్‌నాథ్ 15 నెలలు మాత్రమే పాలించినా 34 శాతం మంది ప్రజలు ఇప్పటికీ ఆయన నాయకత్వంపై సంతృప్తిగా ఉన్నారు. ఇద్దరి మధ్య రెండు శాతం మాత్రమే తేడా ఉండటం గమనార్హం. అంతేకాదు అక్కడి ఎన్నికల్లో మోడీ ప్రభావం గాని, రాహుల్‌గాంధీ ప్రభావం గాని ఉండదని తేలింది. కానీ భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చింది.

అక్టోబర్ 24. 30 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 30 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 3019 శాంపిల్స్ సేకరించారు. ఎవరి పాలన బాగుంది అంటే 36 శాతం మంది శివరాజ్ వైపు, 34 శాతం మంది కమల్‌నాథ్ వైపు నిలిచారు. 13 శాతం మంది ఇద్దరి పాలన బాగుందనగా 11 శాతం మంది బాగాలేదన్నారు.
శివరాజ్‌సింగ్ ప్రభుత్వ హయాంలో మహిళ భద్రత 36 బాగుందంటే అంతేశాతం మంది బాగా లేదన్నారు. శాంతిభద్రత విషయంలోనూ దాదాపు అదే అభిప్రాయం వ్యక్తమైంది. 36 శాతం మంది బాగుంది అంటే 30 శాతం మంది బాగాలేదన్నారు. గత ఐదేళ్లలో ద్రవ్యోల్బణం 82 శాతం పెరిగిందని ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నది. దీనితో పాటు ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయనే ప్రశ్నకు ధరల పెరుగుదల 27శాతం, 13 శాతం పేదరికం, అభివృద్ధి ఆశించిన మేర లేదని 8 శాతం, అవినీతి 5శాతం, 20శాతం ఇతర కారణాలుంటాయన్నారు. ఐదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కుంభకోణంపై ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని 43 శాతం మంది 24 శాతం మంది ఇది కూడా ముఖ్యమైనదే అన్నారు. ప్రభుత్వంపై రైతుల అసంతృప్తి ప్రభావం చాలానే ఉన్నది. 53 శాతం మంది చాలా ముఖ్యమైన అంశం అనగా, 22 శాతం కొంతవరకు ప్రభావం చూపెట్టొచ్చు అంటే 17 శాతంమంది అంతగా ఉండదన్నారు. ఫలితంగా 43 శాతం మంది రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ఎలా ఉన్నదంటే 24 శాతం మంది చాలా బాగుందనగా, 39 శాతం మంది బాగుందన్నారు. 18 శాతం మంది బాగాలేదని, 10 శాతం మంది అసలే బాగాలేదని, 9 శాతం ఏమీ చెప్పలేమన్నారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వ హయాంలో రోడ్లు బాగుపడ్డాయని 55 శాతం మంది చెప్పారు. మహిళా భద్రతల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని 41 శాతం మంది చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా బీజేపీకి కొంత మేలు చేసే అవకాశం ఉన్నట్టు కనిపించింది.
ఏ వర్గాలు ఏ పార్టీ వైపు
మహిళా ఓటర్లు 46 శాతం బీజేపీ వైపు 44 శాతం కాంగ్రెస్, పురుషుల్లో 41 శాతం మంది ఇరు పార్టీల వైపు సమంగా ఉన్నారు. పేదలు 35 శాతం మంది బీజేపీ, 48 శాతం కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఓబీసీల్లో 50 శాతం బీజేపీ, 33 శాతం మంది కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉన్నారు. దళితుల్లో 50 శాతం మంది కాంగ్రెస్‌వైపు ఉండగా, 32 శాతం మంది బీజేపీవైపు ఉన్నారు. ఇక్కడ 35 ఎస్సీ నియోజకవర్గాలు, 47 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. ఈ వర్గాల ఓట్లు కూడా కీలకం కానున్నాయి.
అయితే గిరిజనుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని 34 శాతం మంది చెప్పడం కాషాయ పార్టీకి కష్టకాలమే అని చెప్పకనే చెప్పింది. దిగువ మధ్యతరగతి ప్రజల్లో 38 శాతం బీజేపీ, 44 కాంగ్రెస్ వైపు ఉన్నారు. రైతుల్లో 36 శాతం బీజేపీ, 43 శాతం మంది కాంగ్రెస్ వైపు నిలిచారు.
పట్టణ ఓటర్లలో 55 శాతం బీజేపీ, 35 శాతం మంది కాంగ్రెస్, గ్రామీణ ఓటర్లలో 39 శాతం బీజేపీ, 44 శాతం మంది కాంగ్రెస్ పట్ల అనుకూలంగా ఉన్నారు. మొత్తంగా చూస్తే రైతులు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఓబీసీలు, పట్టణ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాఆ ఓట్లే కాషాయపార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురాలేవన్నది ఈ సర్వే ద్వారా స్పష్టమౌతున్నది.