Rahul Gandhi | కమల చక్రవ్యూహాన్ని నియంత్రిస్తున్న ఆ ఆరుగురు వ్యక్తులు! లోక్‌సభలో నిప్పులు చెరిగిన రాహుల్‌ గాంధీ

యువత, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చక్రవ్యూహాన్ని పన్నిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Rahul Gandhi | కమల చక్రవ్యూహాన్ని నియంత్రిస్తున్న ఆ ఆరుగురు వ్యక్తులు! లోక్‌సభలో నిప్పులు చెరిగిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : యువత, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారులపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చక్రవ్యూహాన్ని పన్నిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘కమల (బీజేపీ ఎన్నికల చిహ్నం) చక్రవ్యూహంలో ఆరుగురు వ్యక్తులు.. నరేంద్రమోదీ, మోహన్‌ భాగవత్‌, అజిత్‌ దోవల్‌, ముకేశ్‌ అంబానీ, గౌతం అదానీ.. ఉన్నారు. ‘వేల ఏళ్లక్రితం కురుక్షేత్ర యుద్ధంలో ఆరుగురు వ్యక్తులు అభిన్యుడిని చక్రవ్యూహంలో బంధించి, అతడిని హతమార్చారు. చక్రవ్యూహాన్ని పద్మ వ్యూహం.. అంటే.. కమల వ్యూహం అని కూడా అంటారని కొంత అధ్యయనం చేసిన తర్వాత తెలుసుకున్నాను. చక్రవ్యూహం కమలం ఆకారంలో ఉంటుంది. 21వ శతాబ్దంలో ఒక కొత్త చక్రవ్యూహాన్ని పన్నారు. అది కూడా కమలం ఆకారంలో. ప్రధాన మంత్రి తన ఛాతీపై దాని చిహ్నాన్ని ధరిస్తారు. ఆరోజు అభిమన్యుడికి జరిగింది ఇప్పుడు భారతదేశంలోని యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారులపై జరుగుతున్నది. ఈ రోజు ఒక ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహంలో కేంద్రంగా ఉన్నారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా, మోహన్‌ భాగవత్‌, అజిత్‌ దోవల్‌, అంబానీ, అదానీ.. ఈ ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహాన్ని నియంత్రిస్తున్నారు’ అని రాహుల్‌ గాంధీ చెప్పారు. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జోక్యం చేసుకోవడంతో ‘మీరు కోరితే ఎన్‌ఎస్‌ఏ, అంబానీ, అదానీ పేర్లను విడిచిపెట్టి, కేవలం మూడు పేర్లే తీసుకుంటాను’ అన్నారు.

‘భారతదేశాన్ని బంధించిన చక్రవ్యూహంలో వెనుక మూడు ప్రధాన శక్తులు ఉన్నాయి. 1.పెట్టుబడిపై గుత్తాధిపత్యం ఆలోచన.. అది.. కేవలం ఇద్దరు భారతీయులు మాత్రమే మాత్రమే యావత్‌ దేశ సంపదను సొంతం చేసుకోవడం. అంటే.. చక్రవ్యూహంలో ఒక అంశం కేంద్రీకరించిన ఆర్థిక శక్తి నుంచి ఉంటుంది. 2.సంస్థలు.. సీబీఐ, ఈడీ, ఐటీ తదితర దర్యాప్తు సంస్థలు. 3.రాజకీయ కార్యనిర్వాహకుడు. ఈ ముగ్గురూ చక్రవ్యూహం మధ్యలో నిలిచి.. ఈ దేశాన్ని నాశనం చేశారు’ అని రాహుల్ మండిపడ్డారు.

కేంద్రబడ్జెట్‌ను తీవ్రంగా దుయ్యబట్టిన రాహుల్‌ గాంధీ.. ఆధిపత్య ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడమే బడ్జెట్‌ ఏకైక లక్ష్యమని అన్నారు. ‘ఈ బడ్జెట్‌.. ఈ చక్రవ్యూహాన్ని బలహీనపరుస్తుందని నేను ఆశించాను. ఈ బడ్జెట్ ఈ దేశ రైతులకు, యువతకు కార్మికులు, చిన్న వ్యాపారులకు సహాయం చేస్తుందని ఆశించాను. కానీ.. నాకు కనిపించింది ఏంటంటే.. ఈ బడ్జెట్‌ ఏకైక లక్ష్యం.. ఈ చట్రం.. వ్యాపార గుత్తాధిపత్య ఫ్రేమ్‌వర్క్‌ను, దేశ ప్రజాస్వామిక వ్యవస్థను, రాజ్యం, ఏజెన్సీలను నాశనం చేసిన రాజకీయ గుత్తాధిపత్యాన్ని బలోపేతం చేసుకోవడమే. దేశంలో ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా వ్యాపారాలపై పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ట్యాక్స్‌ ఉగ్రవాదం దాడి దీని ఫలితమే’ అని రాహుల్‌ వివరించారు.

వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరకు గ్యారెంటీ కల్పించే బిల్లును ఇండియా కూటమి ఆమోదించి తీరుతుందని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. ‘ఈ దేశ రైతాంగానికి నేను చెబుతున్నా. వాళ్లు (ఎన్డీయే) చేయనిది మేం చేసి చూపిస్తాం. ఈ సభలో ఎంఎస్పీకి గ్యారెంటీ కల్పించే బిల్లును ఇదే సభలో ఆమోదింపజేస్తాం. ఈ బడ్జెట్‌కు ముందు మధ్యతరగతి ప్రజలు మోదీకి మద్దతు ఇచ్చేవారు. ఆయన ఆదేశాలపైనే మధ్యతరగతి వర్గం కొవిడ్‌ సమయంలో పళ్లాలు మోగించింది. ఇప్పుడు ఈ బడ్జెట్‌తో మీరు కొంతమంది మధ్యతరగతి ప్రజల వెన్నులో, ఛాతీపై కత్తితో పొడిచారు’ అని రాహుల్‌ అన్నారు.