విధాత : మార్కెట్ లో లభించేప్రతి వస్తువుకు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏదైనా దుకాణానికి లేదా మార్ట్‌కి వెళ్లినప్పుడు అక్కడ కొనే వస్తువులపై కచ్చితంగా ఎక్స్‌పైరీ డేట్ కనిపిస్తుంది. కానీ కోడి గుడ్డుకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా? అవును గుడ్డుకు సైతం ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.
కోడిగుడ్డు భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఆహారాలలో ఒకటిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దుకాణాలలో కోడిగుడ్లు ఉత్పత్తి జరిగి ఎంతకాలం అయ్యింది…వాటిని ఎంతకాలం వరకు వినియోగించవచ్చు అన్నదానిపై ప్రజలకు క్లారిటీ లేకుండా పోతుంది. దీంతో పాడైపోయిన, కుళ్లిపోయిన కోడిగుడ్లను వినియోగించి ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కోడిగుడ్ల విషయంలోనూ సూపర్ మార్కెట్‌లు గడువు తేదీని పేర్కొంటాయి. అయితే కిరాణం దుకాణాలు, కోళ్ల దుకాణాల వద్ద విక్రయించే కోడిగుడ్ల నాణ్యత తెలియక వాటిని కొనుగోలు చేసి జనం నష్టపోవడం కొనసాగుతుంది.
పైగా కాలం చెల్లిన, పాడైపోయిన కోడిగుడ్లతో తయారు చేసే నూడిల్స్, ఎగ్ పప్స్, సమోసా వంటి పలు రకాల బేకరీ ఫుడ్స్, ఎగ్ కర్రీ, ఎగ్ రైస్ వంటి ఆహారాలు తిని ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ లో లభించే ఇతర వస్తువులు, మందుల మాదిరిగానే కోడిగుడ్లపై కూడా కాలపరిమితితో కూడిన ఎక్స్ పైరీ డేట్ ఉండాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంటుంది. అందుకే యూపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కోడి గుడ్డుపై తప్పనిసరిగా ఎక్స్‌పైరీ తేదీని ముద్రించాలని ఉత్తర్వులు జారీచేసింది.
ఉత్తర ప్రదేశ్ లో విక్రయించే ప్రతి గుడ్డుపై ఉత్పత్తి తేదీ, ఎక్స్ పైరీ డేట్ తప్పనిసరిగా ముద్రించాలని ఉత్పత్తిదారులకు యూపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఏప్రిల్ 1నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుండటం గమనార్హం. పౌల్ట్రీలు, ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, రిటైల్ దుకాణాలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాలతో గుడ్డు వినియోగదారులు పాడైన గుడ్లను గుర్తించడం, తాజా గుడ్లను ఎంచుకోవడం సులభతరం కానుంది. పాడైపోయిన, కుళ్లిన కోడిగుడ్ల సరఫరాను అరికట్టి, వినియోగదారులకు తాజావి అందించడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా యూపీ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించని షాపులు, కోడిగుడ్ల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, లైసెన్స్ రద్దు వరకు చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను కఠినంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
తాజా ఆదేశాలపై యూపీ పశు సంవర్థక శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ స్పందించారు. సాధారణంగా కోళ్లు గుడ్లను పెట్టిన తేదీ నుంచి రెండు వారాల వరకు వాడుకోవచ్చని, కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసే గుడ్లను ఐదు వారాల వరకు వాడుకోవచ్చని తెలిపారు. కోడిగుడ్లపై ఉత్పత్తి, ఎక్స్ పైరీ తేదీలను ముద్రణకు ప్రత్యేకంగా ఫుడ్ గ్రేడ్ ఇంక్ మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశించిందని వెల్లడించాు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉండే గుడ్లకు గులాబీ రంగు సిరా, కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసే గుడ్లకు నీలం రంగు సిరాను వాడాలని ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొందని తెలిపారు.
కోడిగుడ్ల నాణ్యత తెలుసుకోవడం ఎలా ?
కోడిగుడ్లు మంచివా కాదా అని తెలుసుకునేందుకు ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో గుడ్డు వేయాలి. గుడ్డు నీటి అడుగున నిలువుగా ఉంటే అది చాలా తాజాదిగా భావించాలి. నీటిపైకి తేలితే అది పాడైపోయిన లేదా పాత గుడ్డుగా గుర్తించాలి. గుడ్డు పగలగొట్టినప్పుడు దుర్వాసన వస్తే, దానిని అస్సలు వాడకూడదు. పచ్చి గుడ్లు ఫ్రిజ్‌లో 3-5 వారాలు, ఉడికించిన గుడ్లు సుమారు 7 రోజులు మాత్రమే నిల్వ ఉంచాలి. అంతకుమించిన గుడ్లు వాడకూడదు.
ఇవి కూడా చదవండి :
ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీకి కేంద్రం నిర్ణయం
Komatireddy : కృష్ణా కాలువల పరిశీలనకు మంత్రి వెంకట్ రెడ్డి బైక్ రైడింగ్ !
