Komatireddy : కృష్ణా కాలువల పరిశీలనకు మంత్రి వెంకట్ రెడ్డి బైక్ రైడింగ్ !

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బైక్ రైడింగ్! నల్లగొండలో స్వయంగా బైక్ నడుపుతూ కృష్ణా కాలువలను పరిశీలించిన మంత్రి. 2028 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని వెల్లడి.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 21, 2026, 3:22 pm IST
Read Time: 3 mins
Komatireddy : కృష్ణా కాలువల పరిశీలనకు మంత్రి వెంకట్ రెడ్డి బైక్ రైడింగ్ !

విధాత : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం తన నల్లగొండ నియోజకవర్గం పర్యటనలో సందడి చేశారు. ముందుగా ఈద్గా వద్ద రంజాన్ ప్రార్ధనలకు హాజరై ముస్లిం మైనార్టీలకు ఈద్ ముబారక్ తెలిపారు. అనంతరం నల్లగొండ మండలం అప్పాజీపేట సహా పలు గ్రామాల్లో స్వయంగా బైక్ నడుపుతూ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే కృష్ణా జలాల సరఫరా కాలువలను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొండపాక గూడెం నుంచి అప్పాజీపేట వరకు నూతనంగా ఏర్పాటు చేసే పిల్ల కాలువ పనులకు మంత్రి అప్పాజీపేటలో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో నల్గొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తా

ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు కాలువల ద్వారా నల్గొండ నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామన్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులు ఇన్ లెట్, అవుట్ లెట్ వైపు పునఃప్రారంభమయ్యాయని, 2028 జూన్ కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తయితే నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్, సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన ధ్యేయమని తెలిపారు. పిల్లకాలువ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇవి కూడా చదవండి :

SLBC Tunnel : ఎస్ ఎల్బీసీ సొరంగం పనులు మళ్లీ షురూ!
Pilot Rohith Reddy : పైలట్ రోహిత్ రెడ్డికి మరోషాక్.. మెయినాబాద్ ఫామ్ హౌస్ సీజ్