SLBC Tunnel : ఎస్ ఎల్బీసీ సొరంగం పనులు మళ్లీ షురూ!
ఎస్ఎల్బీసీ సొరంగం పనులు మళ్లీ ప్రారంభం. ప్రమాదం తర్వాత డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌తో పనులు వేగం, 2028 నాటికి పూర్తి లక్ష్యం.
విధాత : శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనులు మళ్లీ పునః ప్రారంభమయ్యాయి. దొమలపెంట వద్ద ఇన్ లెట్ -1 వద్ద ప్రత్యేక పూజల అనంతరం డ్రిల్లింగ్ పనులు మొదలుపెట్టారు. గతంలో మాదిరిగా టీబీఎం మిషన్లతో కాకుండా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో నిపుణుల పర్యవేక్షణలో పనులు పునఃప్రారంభించడం గమనార్హం. ఇప్పటికే గత ఫిబ్రవరి 18న మన్నెవారి పల్లి అవుట్ లెట్ వైపు సొరంగం పనులు ప్రారంభించడం జరిగింది.
గత ఏడాది ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్ లెట్ పనుల్లో 13.95 కిలో మీటర్ వద్ద సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకుని పనులు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. వారిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికి తీశారు. ఇంకా ఆరుగురి మృతదేహాల ఆచూకీ లభించలేదు. అప్పట్లో 65 రోజుల సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత సొరంగంలో కొండచరియలు, బురద ప్రమాదకరంగా మారడం వల్ల రెస్క్యూ పనులు నిలిపివేయబడ్డాయి. రెస్క్యూ సిబ్బందికి ప్రాణాపాయం పొంచి ఉందనే హెచ్చరికలతో సైన్యం, ఇతర బృందాలతో కూడిన సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సొరంగం ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) సహకారంతో ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వే కూడా పూర్తి చేశారు. సొరంగంలో ఎక్కడెక్కడ భూగర్బ పొరల్లో సమస్యల ఉన్నాయో గుర్తించారు.
2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును 2028జూన్ 30కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా గత నెల ఫిబ్రవరి 18న మన్నేవారిపల్లి అవుట్ లెట్ వైపు నుంచి డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో త్రవ్వకం పనులు ప్రారంభించారు. ఎస్ ఎల్బీసీ టన్నెల్ పొడవు 43.931కిలోమీటర్లు.. ఇప్పటిదాక శ్రీశైలం ఇన్ లెట్ నుంచి 13.93కిలో మీటర్లు తవ్వకం పనులు జరుగగా, మన్నెవారి పల్లి అవుట్ లెట్ నుంచి 20.43కిలో మీటర్లు తవ్వారు. రెండు వైపుల కలిపి 33కిలోమీటర్లు పూర్తయ్యింది. మిగిలిన మరో. 9.559 కిలో మీటర్లు తవ్వాల్సి ఉంది. ఇన్ లెట్, అవుట్ లెట్ లలో సీపేజ్ వాటర్ భారీగా ఉంటుండటంతో ఎప్పటికప్పుడు పంప్ లతో బయటకు తరలిస్తున్నారు. టీబీఎం మిషన్లతో కాకుండా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్దతిలో పనులు కొనసాగిస్తున్నారు.
గ్రీన్ చానల్ నిధులతో పనులు
అత్యంత ప్రాధాన్యత జాబితాలో గ్రీన్ చానల్ నిధులతో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ప్రభుత్వం కొనసాగిస్తుండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ప్రాజెక్టుగా నిలిచే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయితే..శ్రీశైలం జలాశయం నుంచి తీసుకునే 30టీఎంసీల కృష్ణా జలాలతో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టును 1983లో మంజూరు చేయగా..రూ.1,968కోట్ల అంచనా వ్యయంతో 2005లో పనులు ప్రారంభమయ్యాయి. పెరిగిన అంచనాలతో రూ.4,600కోట్లతో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
Pilot Rohith Reddy : పైలట్ రోహిత్ రెడ్డికి మరోషాక్.. మెయినాబాద్ ఫామ్ హౌస్ సీజ్
Gold Silver Prices | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram