ఎల్​టీటీఈ ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. తమిళ రాజకీయాల్లో మళ్లీ ‘ఈలం’ చర్చ

తమిళనాడు సీఎం విజయ్ ఎల్‌టిటిఈ చీఫ్ ప్రభాకరన్ వర్థంతి సందర్భంగా ముల్లివైక్కల్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్​ మీడియలో ఒక భావోద్వేగ పోస్టు చేశారు. శ్రీలంక తమిళుల హక్కుల కోసం ఎప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.

ఎల్​టీటీఈ ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. తమిళ రాజకీయాల్లో మళ్లీ ‘ఈలం’ చర్చ ప్రభాకరన్ వర్థంతి సందర్భంగా నివాళి అర్పించిన తమిళనాడు సీఎం విజయ్

Tamil Nadu CM Vijay Pays Tribute To LTTE Chief Prabhakaran On Mullivaikkal Remembrance Day

విధాత భారత్​ డెస్క్​ | మే 18, 2026:

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి శ్రీలంక తమిళుల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్‌టిటిఈ వ్యవస్థాపకుడు వేలుపిళ్లై ప్రభాకరన్​ వర్థంతి సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పించారు.

శ్రీలంకలోని ముల్లివైక్కల్​లో 2009 మే 18న జరిగిన ఆఖరి పోరాట ఘటనలను గుర్తు చేసుకుంటూ విజయ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ముల్లివైక్కల్​ జ్ఞాపకాలను మన గుండెల్లో మోస్తూనే ఉంటామనీ, సముద్రం ఆవలి తమిళ సోదరుల హక్కుల కోసం ఎప్పుడూ అండగా ఉంటామని విజయ్​ పేర్కొన్నారు.

ఏంటీ ముల్లివైక్కల్​ ?

ఎల్‌టిటిఈ జెండా మరియు శ్రీలంకలో తమిళ ఈళం ప్రభావ ప్రాంతాల మ్యాప్

శ్రీలంక తమిళ ఈలం ఉద్యమానికి ప్రతీకగా ఎల్‌టిటిఈ జెండా, ప్రభావ ప్రాంతాల మ్యాప్

శ్రీలంక అంతర్యుద్ధం చివరి దశలో ముల్లివైక్కల్ ప్రాంతం దారుణ రక్తపాతానికి వేదికైంది. అక్కడ వేలాది మంది తమిళ పౌరులు లంక సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీలంక తమిళులు ప్రతి సంవత్సరం మే 18ను “ముల్లివైక్కల్ స్మరణ దినం”గా నిర్వహిస్తుంటారు.

శ్రీలంక తమిళులపై వివక్ష జరుగుతోందనే ఆరోపణలతో ప్రారంభమైన ఉద్యమం, తర్వాత దాదాపు 30 ఏళ్లపాటు సాగిన అంతర్యుద్ధంగా మారింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాడిన ఎల్‌టిటిఈ(లిబరేషన్​ టైగర్స్​ ఆఫ్​ తమిళ్​ ఈలం)కు నాయకత్వం వహించిన ప్రభాకరన్ 2009లో శ్రీలంక సైన్యం చేతిలో మరణించినట్లు ప్రకటించారు.

తమిళనాట హాట్‌టాపిక్​గా మారిన సీఎం వ్యాఖ్యలు

భారత మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ హత్య కేసులో ఎల్‌టిటిఈ పాత్ర ఉన్న కారణంగా ఆ సంస్థపై భారత్‌లో నిషేధం అమలులో ఉంది. ప్రభాకరన్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. ఈ కారణం వల్ల తమిళనాడులో రాజకీయ పార్టీల నేతలు సాధారణంగా ప్రభాకరన్‌కు బహిరంగ మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. అలాంటి సమయంలో టివీకే పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఎల్‌టిటిఈ మిత్ర వైఖరికి ప్రసిద్ధి చెందిన వీసీకే పార్టీ మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

ఇప్పటికే 2025 సెప్టెంబర్‌లో నాగపట్టణం సభలో కూడా విజయ్ శ్రీలంక తమిళుల సమస్యను ప్రస్తావించారు. తల్లిలా ఆదరించిన నాయకుడిని కోల్పోయిన ఈళం తమిళుల కోసం మనం గొంతెత్తాలంటూ అప్పట్లో పిలుపునిచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తీసుకురావడం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.