Waqf (Amendment) Act, 2025 | వక్ఫ్ సవరణ చట్టం కేసులో సీజేఐ ఖన్నా సంచలన నిర్ణయం
Waqf (Amendment) Act, 2025 | మే 5వ తేదీకి కేసును లిస్టు చేసిన సుప్రీంకోర్టు.. ప్రాథమిక విచారణ జరిపి, అవసరమైతే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందని భావించారు. అయితే.. భోజన విరామం అనంతరం బెంచ్ కొలువుదీరగానే ఈ కేసులో ఎలాంటి వాదనలు వినేందుకు సిద్ధంగా లేనని తెలిపారు. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించారని, అయితే.. తనకు ఈ పదవీకాలంలో తగిన సమయం లేదని పేర్కొన్నారు.

- కేసు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన
- మరో 4 రోజుల్లో జస్టిస్ ఖన్నా పదవీకాలం పూర్తి
Waqf (Amendment) Act, 2025 | వక్ఫ్ కేసు నుంచి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా వైదొలిగారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వుల జారీ లేదా రిజర్వ్ చేయలేనని సోమవారం (మే 5, 2025) పేర్కొన్నారు. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుదీర్ఘంగా వాదనలు వినాల్సి ఉన్నదని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను తన తదుపరి సీజేఐగా రానున్న జస్టిస్ బీఆర్ గవాయి కొనసాగిస్తారని తెలిపారు. పిటిషన్లన్నింటినీ జస్టిస్ గవాయి నేతృత్వంలోని బెంచ్ మే 15న విచారిస్తుందని జస్టిస్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం పేర్కొన్నది.
జస్టిస్ గవాయి ఈ విచారణను ముందుకు తీసుకెళతారు..
భారతదేశ సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ గవాయికి వక్ఫ్ చట్టంపై పిటిషన్లు ప్రధానమైన కేసు కానున్నది. మే 14న కొత్త సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్ గవాయి.. ఆ పదవిలో నవంబర్ వరకూ కొనసాగనున్నారు. ఏప్రిల్ 17నాటి విచారణ సందర్భంగా కూడా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని ప్రకటించింది. అయితే.. తదుపరి విచారణ (మే 5, 2025)లోపు వక్ఫ్ ఆస్తుల జోలికి వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కేంద్రం కూడా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ లేదా రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించబోమని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. మే 5వ తేదీకి కేసును లిస్టు చేసిన సుప్రీంకోర్టు.. ప్రాథమిక విచారణ జరిపి, అవసరమైతే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందని భావించారు. అయితే.. భోజన విరామం అనంతరం బెంచ్ కొలువుదీరగానే ఈ కేసులో ఎలాంటి వాదనలు వినేందుకు సిద్ధంగా లేనని తెలిపారు. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించారని, అయితే.. తనకు ఈ పదవీకాలంలో తగిన సమయం లేదని పేర్కొన్నారు.