Watermelon | బిర్యానీ తిన్న కాసేపటికే పుచ్చకాయ తినడంతో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతిచెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో పుచ్చకాయ తినడానికే చాలామంది భయపడుతున్నారు. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పుచ్చకాయ ధరలు భారీగా పడిపోయాయి. రెండు మూడు రోజుల కిందటి వరకు కూడా కిలో పుచ్చకాయ ధర రూ.30 నుంచి 40 వరకు ఉండగా.. అది ఇప్పుడు రూ.5 నుంచి 7కి పడిపోయింది.
దక్షిణ ముంబైలోని పైధోనీకి చెందిన అబ్దుల్లా డోకాడియా (40), ఆయ భార్య నస్రీన్ డోకాడియా (35), కుమార్తెలు ఆయేషా (16), జైనబ్ (13)లు ఇటీవల అనుమానాస్పదంగా మృతిచెందారు. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 9 మందితో కలిసి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వీరు బిర్యానీ తిన్నారు. డిన్నర్ తర్వాత బంధువులు వెళ్లిపోగా.. రాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లో మిగిలిపోయిన పుచ్చకాయను తిని పడుకున్నారు.
తెల్లవారుజామున 5 గంటల వరకు నలుగురూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయి. స్థానిక వైద్యుడి చికిత్స చేసినప్పటికీ లాభం లేకపోవడంతో.. అతని సూచన మేరకు జేజే ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడకు చేరుకునేలోపే ఒకరు మరణించగా.. 12 గంటల వ్యవధిలోనే మిగతా ముగ్గురూ మరణించారు.
బిర్యానీ తిన్న కాసేపటికే పుచ్చకాయ తినడంతోనే ఆ ఫ్యామిలీలోని నలుగురు మరణించారనే వార్తతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే అది నిజమా? కాదా అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. దీనికోసం ఆ ఫ్యామిలీ ఇంటి నుంచి బిర్యానీ, పుచ్చకాయ, నీరు, బియ్యం, చికెన్, ఖర్జూరాలు, మసాలా పదార్థాలు తదితర 11 నమూనాలను ఆహార భద్రత అధికారులు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆ నివేదిక వస్తేనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ దీని ప్రభావం మాత్రం పుచ్చకాయ మార్కెట్‌పై తీవ్రంగా పడింది.
ఈ ఘటనకు ముందు ముంబైలో హోల్‌సేల్ మార్కెట్‌లో పుచ్చకాయ కిలో రూ.10 నుంచి రూ.35 మధ్య ఉండేది. అదే రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.30 నుంచి 100 ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధర అమాంతం రూ.5నుంచి రూ.7కి పడిపోయింది. వినియోగదారుల్లో భయం పెరగడంతో డిమాండ్ తగ్గిపోయి, వ్యాపారాలు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు.
Read More:
Watermelon | పుచ్చపండును ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
పుచ్చకాయ కూడా మనుషులను చంపగలదా? ముంబై మరణాల తర్వాత డాక్టర్లు చెప్పిన షాకింగ్ నిజాలు
