• Telugu News
  • /National

Defamation Case | 90 ఏళ్ల బామ్మ మొండిపట్టు.. పరువు నష్టం కేసు విచారణ 20 ఏళ్లకి వాయిదా!

బాంబే హైకోర్టులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. 90 ఏళ్ల బామ్మ వేసిన పరువు నష్టం కేసుపై విచారణను 20 ఏళ్లకు వాయిదా వేసింది. 2046 వరకు ఈ కేసు విచారణకు తీసుకోబోమని స్పష్టం చేసింది.

Reported by: Chandram | జాతీయం | Apr 29, 2026, 10:19 pm IST
Read Time: 5 mins
Defamation Case | 90 ఏళ్ల బామ్మ మొండిపట్టు.. పరువు నష్టం కేసు విచారణ 20 ఏళ్లకి వాయిదా!

Defamation Case | బాంబే హైకోర్టులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. 90 ఏళ్ల బామ్మ వేసిన పరువు నష్టం కేసుపై విచారణను 20 ఏళ్లకు వాయిదా వేసింది. 2046 వరకు ఈ కేసు విచారణకు తీసుకోబోమని స్పష్టం చేసింది. ఇది అసలు ప్రాధాన్యత కలిగిన కేసు కాదని.. కేవలం అహంకారం పోరుగా మారిందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ జితేంద్ర జైన్ ఒక పేజీ ఉత్తర్వు జారీ చేశారు.

కేసు వివరాలేంటి?

ప్రముఖ గుజరాతీ రచయిత్రి, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత తరిణిబెన్ దేశాయ్ (90), ఆమె కుమార్తె ధ్వని దేశాయ్ (57) దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌కు చెందిన శ్యామ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులపై 2017లో రూ.20 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. సొసైటీ నిర్వహణకు సంబంధించి మేనేజింగ్ కమిటీని ప్రశ్నించినప్పుడు తమను బకాయిదారులుగా వ్యాఖ్యానించారని పేర్కొంది. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని.. తమ పరువుకు భంగం కలిగించారని కోర్టును ఆశ్రయించారు.

దాదాపు పదేళ్ల పాటు ఈ కేసు కొనసాగడంతో త్వరితగతిన పూర్తి చేయాలని జస్టిస్ జితేంద్ర జైన్ భావించారు. హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు భేషరతుగా క్షమాపణ చెబితే కేసును ముగించాలని పిటిషనర్లకు సూచించారు. కమిటీ సభ్యులు కూడా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ తరిణిబెన్ దేశాయ్ మాత్రం క్షమాపణను అంగీకరించబోమని.. చట్టపరంగానే తేల్చుకుంటామని స్పష్టం చేసింది.

90 ఏళ్ల బామ్మ మొండి పట్టుదలపై జస్టిస్ జితేంద్ర జైన్ తీవ్రంగా స్పందించారు. జీవితం చరమాంకంలో ఉండి కూడా కేవలం అహంకారానికి పోయి ఇలాంటి కేసులతో న్యాయ వ్యవస్థను స్తంభింపజేస్తున్నారని అన్నారు. “ఈ వ్యవహారం కేవలం క్షమాపణతో ముగిసే విషయం. కానీ పిటిషనర్ అయిన 90 ఏళ్ల వృద్ధురాలు ఇంకా పరువు నష్టం కేసును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. దీనివల్ల అత్యవసరమైన మిగతా కేసులను విచారించకుండా కోర్టు సమయం వృథా అవుతుంది” అని పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసును 2046 సంవత్సరానికి వాయిదా వేస్తున్నామని తెలిపారు. అప్పటి వరకు ఈ కేసును విచారణకు తీసుకోరాదని.. ఈ కేసుకు సీనియర్ సిటిజన్ లేదా సూపర్ సీనియర్ సిటిజన్ అనే కారణంతో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకూడదని తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

Read More:

Transgenders | ట్రాన్స్‌జెండర్లు శుభకార్యాలకు వచ్చి డబ్బులు అడిగే హక్కు లేదు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

Cooking Gas Shortage | ప్లాస్టిక్ బెలూన్లలో వంట గ్యాస్ నింపుకుంటున్న పాక్ ప్రజలు.. మొబైల్ బాంబ్‌గా మారిపోతున్న ఇళ్లు