రేప్ కేసులో ప్రముఖ మీడియా సంస్థ తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో బాంబే హైకోర్టులోని గోవా ధర్మాసనం గురువారం అతడిని దోషిగా తేల్చింది. 2013లో జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. 2021లో ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా తేల్చగా.. తాజాగా హైకోర్టు ఆ తీర్పును రద్దు చేసింది. ఈ కేసులో తేజ్ పాల్ ను దోషిగా గుర్తించిన ధర్మాసనం పదేళ్ల శిక్షను ప్రకటించింది. రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
2013లో గోవాలో జరిగిన థింక్ ఫెస్ట్ ఈవెంట్‌లో పాల్గొన్న సమయంలో హోటల్ ఎలివేటర్‌లో తేజ్‌పాల్ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించారు. దీంతో అదే ఏడాది నవంబరులో అతడిని అరెస్టు చేయగా.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసుపై 2017లో మాపులా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా.. తేజ్‌పాల్‌ను నిర్దోషిగా తేలుస్తూ 2021లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దానిని గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదలను వినిపించారు. తీర్పు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘తేజ్‌పాల్‌ను తక్షణమే అరెస్టు చేయాలి. బాధితురాలికి తండ్రి వయసులో ఉన్న అతడు ఈ నేరానికి పాల్పడ్డాడు. బాధితురాలు వద్దన్న వినకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఒక అమ్మాయి వద్దంటే.. దాని అర్థం వద్దనేనని, దీనిపై ఈ కోర్టు సమాజానికి గట్టి సందేశం ఇవ్వాలి అని మెహతా న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
మరోవైపు నిందితుతు తేజ్ పాల్ సైతం ఈ కేసులో తానే బాధితుడినని, ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలని, నాకు భార్య ఉంది అని, ఇంతకుమించి నేను చెప్పడానికి ఏమీ లేదు అని కోర్టుకు విన్నవించుకున్నాడు. నేను అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉందని, దయచేసి నాపై కనికరం చూపండని, వాస్తవాలన్నీ రికార్డు చేసే ఉన్నాయి అని అభ్యర్థించాడు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తేజ్ పాల్ ను దోషిగా నిర్ధారించి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పును వెల్లడించింది.