మోదీ పాలన.. లోక్‌సభ ఎన్నికలపై విదేశీ మీడియా చెబుతున్నదేంటి?

మనం ఏంటో మనం ఎంత చెప్పుకొన్నా.. కొందరు చూస్తూనే ఉంటారు. మనం ఏంటో, మన వైఖరేంటో గమనిస్తూనే ఉంటారు. ఇక్కడి ప్రభుత్వ పనితీరుపై దేశీయ మీడియా కళ్లు మూసుకున్నా.. మన దగ్గర ఏం జరుగుతున్నదో ప్రపంచం చూస్తేనే ఉన్నది

మోదీ పాలన.. లోక్‌సభ ఎన్నికలపై విదేశీ మీడియా చెబుతున్నదేంటి?

న్యూయార్క్‌: మనం ఏంటో మనం ఎంత చెప్పుకొన్నా.. కొందరు చూస్తూనే ఉంటారు. మనం ఏంటో, మన వైఖరేంటో గమనిస్తూనే ఉంటారు. ఇక్కడి ప్రభుత్వ పనితీరుపై దేశీయ మీడియా కళ్లు మూసుకున్నా.. మన దగ్గర ఏం జరుగుతున్నదో ప్రపంచం చూస్తేనే ఉన్నది. ఎప్పటికప్పుడు ప్రపంచానికి చాటి చెబుతూనే ఉన్నది. భారతదేశం విశ్వగురు అని, ప్రపంచానికి పాఠాలు చెబుతుందని ఎంత సొంత డబ్బా కొట్టుకున్నా.. దేశంలో మోదీ ప్రభుత్వ పనితీరును సునిశితంగా విదేశీ మీడియా ఎండగడుతూనే ఉన్నది.
భారతదేశంలో పెరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, హిందూత్వ పెరుగుదలపై భారతదేశానికి వెలుపలి ఉన్న ప్రపంచ గొంతులు పర్యవేక్షిస్తూ, విమర్శలు చేస్తూ ఉన్నాయి.

పదేళ్ల సంగతి పక్కన పెడితే.. గత పదిహేను రోజుల్లోనే.. 2024 ఏప్రిల్‌ 16 నుంచి 30 మధ్య ఐరాస నిపుణులు మొదలుకుని, పౌర హక్కుల గ్రూపులు, అంతర్జాతీయ మీడియా, వివిధ దేశాల పార్లమెంటేరియన్లు భారత ప్రజాస్వామ్యం గురించి ఏం చెప్పారో గమనిస్తే.. భారతదేశంలోని మీడియా ఏం దాచిపెడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన సీఎన్‌ఎన్‌లో ఏప్రిల్‌ 16న మోదీ ఉత్థానం గురించి ప్రస్తావించిన రియా మొగల్‌.. హిందూ జాతీయవాదాన్ని మరింత పెంచేందుకు మత దురభిమానం ఒక సాధానంగా ఉపయోగిస్తున్నారని రాశారు. అదే సమయంలో విధానపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

అమెరికాకు చెందిన ఎన్‌పీఆర్‌లో దియా హదిద్‌ ఏప్రిల్‌ 17న ఒక వ్యాసం రాస్తూ.. అయోధ్యపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మథురలో మసీదు, ఆలయంపై శతాబ్దాల ఒప్పందాన్ని ఇక తెగ్గొట్టాలన్న అభిప్రాయానికి హిందూ జాతీయవాదులను ప్రేరేపించిందని పేర్కొన్నారు. ఎప్పుడో మధ్యయుగాల్లో ముస్లిం ఆధిపత్యానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలన్న భావన కనిపిస్తున్నదని రాశారు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఫలితం ఏది వచ్చినా.. ఓడిపోయేది మాత్రం భారతదేశ ప్రజాస్వామ్యమేనని బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక భారత లోక్‌సభ ఎన్నికలపై ఏప్రిల్‌ 17న రాసిన సంపాదకీయంలో పేర్కొన్నది.

ప్రతిపక్ష నేతల అరెస్టులు, వారి పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనలు, ఎవరికివారే పోలీసులుగా తయారై సమాజాన్ని హింసించడం అనేవి బలహీన ప్రజాస్వామ్యానికి కొన్ని సంకేతాలని వ్యాఖ్యానించింది. కెనడాకు చెందిన గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌ ఏప్రిల్‌ 18నాటి డిసిబుల్‌ పోడ్‌కాస్ట్‌ ఎపిసోడ్‌లో టొరంటో మెట్రోపాలిటన్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సంజయ్‌ రూపారెలియా.. మోదీ రెండు విడుతల పాలనలో భారతదేశం ఎలా మారిందో మాట్లాడారు. కొత్త నైతిక ప్రవర్తనా నియమావళిని విధించేందుకు హిందూత్వ జాతీయ వాదులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వారి సామాజిక ప్రచారాలు భారత్‌లో రోజువారీ జీవితం స్వభావాన్నే బెదిరిస్తున్నాయని చెప్పారు.

న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ పార్లమెంటు సభ్యులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన, ముస్లింలపై విద్వేష ప్రసంగాలు, సీఏఏను వ్యతిరేకించేవారిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టాల దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియాలో మైనార్టీలపై దాడులను ఆపేందుకు ఒక తీర్మానం ఆమోదించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు. అమెరికా విదేశాంగ శాఖ భారతదేశంలో అనేక అంశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని పేర్కొన్నది.