Lok Sabha Elections | రేపే చివరి దశ ఎన్నికలు.. పోటీ పడుతున్న ప్రముఖులు వీరే..!
ఇండియాలో లోక్‌సభ ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకుంది. మొత్తంగా రెండు నెలలకు పైగా కొనసాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పూర్తి కానుంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరిగాయి. రేపు(జూన్ 1) ఏడో దశ ఎన్నికలకు పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికల పర్వం ముగియనుంది.

Lok Sabha Elections | న్యూఢిల్లీ : ఇండియాలో లోక్‌సభ ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకుంది. మొత్తంగా రెండు నెలలకు పైగా కొనసాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలతో పూర్తి కానుంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరిగాయి. రేపు(జూన్ 1) ఏడో దశ ఎన్నికలకు పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికల పర్వం ముగియనుంది.
ఏడు రాష్ట్రాలలోని 57 లోక్‌సభ సీట్లకు చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 904 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. ఏడో దశలో యూపీలో13 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. బీహార్‌లోని 8, పశ్చిమ బెంగాల్‌లో 9, జార్ఖండ్ 3, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6 లోక్ సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీఘర్‌కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..ఆ తర్వాత యూపీలో 144 మంది , బిహార్‌లో 134, ఒడిశాలో 66, జార్ఖండ్‌లో 52, హిమాచల్‌ప్రదేశ్‌లో 37, ఛండీఘర్ నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
పోటీ పడుతున్న ప్రముఖులు వీరే..
ప్రధాని మోదీ వర్సెస్ అజయ్ రాయ్
వారణాసి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ పోటీ పడుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వారణాసి నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. అజయ్ రాయ్ గతంలో బీజేపీలో కొనసాగారు. 2012లో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కంగనా రనౌత్ వర్సెస్ విక్రమాదిత్య సింగ్
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున నటి కంగనా రనౌత్ బరిలో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి హిమాచల్ మాజీ సీఎం వీర్‌భద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య పోటీలో ఉన్నారు. వీర్‌భద్ర కుటుంబానికి మండి కంచుకోటగా ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వీర్‌భద్ర సింగ్ భార్య ప్రతిభా దేవి సింగ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కంగనా, విక్రమాదిత్య మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఎవరు గెలుస్తారు..? అనే దానిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
రవి కిషన్ వర్సెస్ కాజల్ నిషాద్
యూపీలోని గోరఖ్‌పూర్ నియోజకవర్గం కూడా ప్రాధాన్యంగా మారింది. ఇక్కడ నటుడు రవి కిషన్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రవి కిషన్‌పై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్ బరిలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి రామ్‌భూవాల్ నిషాద్‌పై కిషన్ గెలుపొందారు.
అనురాగ్ ఠాకూర్ వర్సెస్ సత్పాల్ సింగ్ రాయ్‌జడా
హమీర్‌పూర్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీలో ఉన్నారు. ఈయనపై కాంగ్రెస్ నుంచి సత్పాల్ సింగ్ రాయ్‌జడా పోటీ చేస్తున్నారు. అనురాగ్ ఠాకూర్ 2008లో తొలిసారిగా ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు.
అభిషేక్ బెనర్జీ వర్సెస్ అభిజిత్ దాస్
మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వెస్ట్ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంది. బీజేపీ నుంచి అభిజిత్ దాస్, సీపీఐ(ఎం) నుంచి ప్రతికూర్ రహమాన్ పోటీలో ఉన్నారు.
మీసా భారతి వర్సెస్ రామ్ కృపాల్ యాదవ్
బీహార్‌లోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం కూడా ఈ ఎన్నికల్లో ప్రాధాన్యంగా మారింది. ఎందుకంటే బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్‌కు మీసా భారతి గట్టి పోటినిచ్చి ఓడిపోయారు. ఆర్జేడీ లీడర్‌గా ఉన్న రామ్ కృపాల్ యాదవ్‌కు 2014 ఎన్నికల్లో లాలు ప్రసాద్ యాదవ్ ఎంపీ టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో యాదవ్‌కు 3,83,262 ఓట్లు రాగా, మీసా భారతికి 3,42,940 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో యాదవ్‌కు 5,09,557 ఓట్లు పోలవ్వగా, భారతికి 4,70,236 ఓట్లు వచ్చాయి.