Mohammed Yousuf Tarigami । హిమాలయాల్లో ఎర్ర సూరీడు.. మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి ప్రస్థానం ఇదీ..

ఆయన జీవితం రేసాయి సబ్‌ జైల్‌ వంటి జైళ్లు, అత్యంత ప్రమాదకరమైన టార్చర్‌ సెంటర్‌లైన రెడ్‌ 16, పాపా 2 వంటి కేంద్రాల్లో సాగింది. 2005లో పటిష్ఠమైన భద్రత ఉండే శ్రీనగర్‌లోని తులసీబాగ్‌లోకి చొరబడి.. తరిగామి, మంత్రి గులాం నబీ లోన్‌ నివాసాలపై దాడులకు తెగబడ్డారు. ఆ ఘటనలో గులాం నబీలోన్‌ హత్యకు గురయ్యారు. ఉగ్రవాదులను తరిగామి అంగరక్షకులు గట్టిగా తిప్పికొట్టారు. అయితే.. ఆ ఘటనలో ఒక అంగరక్షకుడు చనిపోయాడు.

Mohammed Yousuf Tarigami । హిమాలయాల్లో ఎర్ర సూరీడు.. మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి ప్రస్థానం ఇదీ..

జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థి, పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి మహ్మద్‌ యుసుఫ్‌ తరిగామి వరుసగా ఐదోసారి విజయం సాధించారు. జమాతే ఇస్లామీ అభ్యర్థి సాయర్‌ రేషిపై ఆయన గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి తరిగామి 1996లో తొలిసారి గెలిచారు. 2002, 2008, 2014లో తన విజయపరంపరను కొనసాగించి.. 2024 ఎన్నికల్లోనూ తన సత్తా చాటుకున్నారు. ఆయనకు 33,390 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, నిషిద్ధ మత సంస్థ జమాతే ఇస్లామీ అభ్యర్థి రేషికి 25,639 ఓట్లు లభించాయి. కుల్గామ్‌ నుంచి మొత్తం పది మంది పోటీ చేశారు.

మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి 1949 జూలై 17న జన్మించారు. వాస్తవానికి ఆయన అసలు పేరు మహ్మద్‌ యూసుఫ్‌ రథేర్‌. అయితే.. యూసుఫ్‌  అరెస్టు గురించి అప్పటి ముఖ్యమంత్రి షేక్‌ అబ్దుల్లా ‘ఓ జో తరిగామ్‌ వాలా’ అంటూ ఆయన సొంతూరిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆయన మీడియాలో మహ్మద్ యూసుఫ్‌ తరిగామిగా పేర్కొంటూ వచ్చారు. అదే ఆయన పేరుగా స్థిరపడిపోయింది. సీపీఎంకు చెందిన తరిగామి.. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు. గతంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. కుల్గామ్‌లోని తరిగామ్‌ అనే ఊళ్లో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన జన్మించారు. ఆయన తండ్రి గులామ్‌ రసూల్‌ రాథెర్‌. అప్పట్లో జమ్ముకశ్మీర్‌లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో యూసుఫ్‌ తరిగామి తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయలేక పోయారు. 1975లో ఆయన జైల్లో ఉన్న సమయంలో బిడ్డకు జన్మనిస్తూ తరిగామి భార్య చనిపోయారు.

చావల్‌గామ్‌కు చెందిన అబ్దుల్‌ కబీర్‌ వనీ ప్రభావంతో యూసుఫ్‌ తరిగామి కమ్యూనిస్టు  ఉద్యమంలోకి వచ్చారు. 1967లో తరిగామి 18 ఏళ్ల వయసులోనే ఆయన స్నేహితుడు గులాం నబీ మాలిక్‌ (ప్రస్తుత జమ్ముకశ్మీర్‌ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి)తో కలిసి అనంత్‌నాగ్‌ డిగ్రీ కాలేజీలో సీట్లు పెంచాలని ఉద్యమించారు. రివల్యూషనరీ స్టూడెంట్స్‌ అండ్‌ యూత్‌ ఫెడరేషన్‌లో వీరిద్దరూ భాగంగా ఉండేవారు. కాలేజీలో సీట్లు పెంచాలని డిమాండ్‌ చేస్తూ 36 గంటలపాటు డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఈ ఉద్యమంతో అధికారులు కాలేజీలో సీట్ల సంఖ్య పెంచక తప్పలేదు. ఈ ఉద్యమం తర్వాత అబ్దుల్‌ ఖాదిర్‌ నేతృత్వంలో తరిగామి అనేక రైతు పోరాటాల్లో భాగమయ్యారు. అయితే.. వారి రాజకీయ కార్యశీలత 1967లో డెమోక్రటిక్‌ కాన్ఫరెన్స్‌లో చేరడంతో పూర్తిగా మారిపోయింది. ఈ కూటమిలో సీపీఎం భాగస్వామిగా ఉండేది. కమ్యూనిస్టు నేత రామ్‌ప్యారే సరాఫ్‌కు ఆయన బాగా దగ్గరయ్యారు. ఆయనకు అనుచరుడిగా మారారు. సీపీఎంతో విభేదించి సరాఫ్‌ సీపీఐ (ఎంఎల్‌)లో చేరినప్పుడు తరిగామి కూడా ఆయన బాటలోనే నడిచారు. రైతుల నుంచి బలవంతంగా వరి ధాన్య సేకరణకు వ్యతిరేకిస్తూ అరెస్టయ్యారు. 1975లో ఇందిరాగాంధీ- షేక్‌ అబ్దుల్లా ఒప్పందం తర్వాత జమ్ముకశ్మీర్‌ను యూనియన్‌ ఆఫ్‌ ఇండియాలో భాగస్వామిగా చేర్చారు. అయితే.. స్వయంపాలనాధికారం కోసం తరిగామి డిమాండ్‌ చేయడంతో ఆయనను జైల్లో పెట్టారు. ఆ సమయంలోనే ఆయన భార్య చనిపోయారు. నెల రోజులపాటు పెరోల్‌ ఇచ్చినా.. మూడు రోజులకే ఆయనను తిరిగి అరెస్టు చేశారు.

1979లో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని జుల్ఫీకర్‌ అలీ భుట్టోను ఉరి తీసిన తర్వాత కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగిన సమయంలో మార్కిస్టులను షేక్‌ అబ్దుల్లా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వివాదాస్పద ప్రజా భద్రత చట్టం కింద అరెస్టయిన తొలి వ్యక్తి తరిగామి. జుల్ఫీకర్‌ అలీ భుట్టో ఉదంతం తర్వాత తరిగామి, మాలిక్‌ తిరిగి సీపీఎంలో చేరి, కుల్గామ్‌ ప్రధాన రాజకీయ స్రవంతిలో కొనసాగారు.

ఆయన జీవితం రేసాయి సబ్‌ జైల్‌ వంటి జైళ్లు, అత్యంత ప్రమాదకరమైన టార్చర్‌ సెంటర్‌లైన రెడ్‌ 16, పాపా 2 వంటి కేంద్రాల్లో సాగింది. 2005లో పటిష్ఠమైన భద్రత ఉండే శ్రీనగర్‌లోని తులసీబాగ్‌లోకి చొరబడి.. తరిగామి, మంత్రి గులాం నబీ లోన్‌ నివాసాలపై దాడులకు తెగబడ్డారు. ఆ ఘటనలో గులాం నబీలోన్‌ హత్యకు గురయ్యారు. ఉగ్రవాదులను తరిగామి అంగరక్షకులు గట్టిగా తిప్పికొట్టారు. అయితే.. ఆ ఘటనలో ఒక అంగరక్షకుడు చనిపోయాడు.

370వ అధికరణం రద్దు చేసిన తర్వాత శ్రీనగర్‌లోని తన నివాసంలో ఆయన 35 రోజులపాటు గృహనిర్బంధానికి గురయ్యారు. అప్పటి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసి.. కోర్టు అనుమతితో ఆయనను కలుసుకోగలిగారు. ప్రత్యేక హోదా రద్దయినప్పటి తరిగామి డిటెన్షన్‌లోనే ఉన్నారు. 2019 సెప్టెంబర్‌ 5న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తరిగామిని ఢిల్లీకి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం ఆయన కశ్మీర్‌లో స్వేచ్ఛగా సంచరించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన తొలి రాజకీయ నాయకుడు తరిగామి.  రాష్ట్రంలోని పలువురు రాజకీయ ప్రముఖులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ‘మేము, అబ్దుల్లా, ఇతర నాయకులు ఉగ్రవాదులం కాదు. మేం కూడా బతకాలని అనుకుంటున్నాం., ఒక కశ్మీరీ ఈ మాట చెబుతున్నాడు’ అని తరిగామి అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో కూడా సవాలు చేశారు.