రెండు దశల్లో తగ్గిన ఓటింగ్‌ చెబుతున్నకీలక అంశమేంటి?

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన తాజా అప్‌డేట్‌ ప్రకారం.. తొలి దశలో 66.14శాతంగా ఉన్నది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే దాదాపు నాలుగు శాతం తగ్గింది

రెండు దశల్లో తగ్గిన ఓటింగ్‌ చెబుతున్నకీలక అంశమేంటి?
  • ఎండల తీవ్రతే కారణమని పలువురి సమర్థన
  • పొలిటికల్‌ వేవ్‌ లేకపోవడం వల్లే ఓటర్లలో నిరాసక్తత
  • అధికార బీజేపీకి కలవరం కలిగించే అంశమంటున్న విశ్లేషకులు
  • గతంలో వేసవిలో, కరోనా సమయంలో భారీ ఓటింగ్‌ ప్రస్తావన

న్యూఢిల్లీ : ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల్లో పోలింగ్‌ శాతం తగ్గింది. ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన తాజా అప్‌డేట్‌ ప్రకారం.. తొలి దశలో 66.14శాతంగా ఉన్నది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే దాదాపు నాలుగు శాతం తగ్గింది. ఒక రెండో విడుత పోలింగ్‌66.71 శాతంగా తెలిపింది. ఇది కూడా 2019 ఎన్నికలతో పోల్చితే మూడు శాతం తగ్గుదల కనిపిస్తున్నది. ఈ రెండు దశల్లో పోలింగ్‌ తగ్గటానికి ప్రధాన కారణం ఎండ తీవ్రతే కారణమని పలువురు చెబుతున్నా.. వాస్తవానికి పొలిటికల్‌ వేవ్‌ లేకపోవడం వల్లే ఓటింగ్‌ తగ్గిందని, అయితే.. ఎండల తీవ్రతే కారణమంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి.

నాడు నడిచి వెళ్లి ఓటు వేసేవారు
‘ఇప్పుడంటే గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ.. గతంలో ఎక్కువ మంది ప్రజలు నడుచుకుంటూ వెళ్లడమో, సైకిళ్లు లేదా లాగుడు బండ్లు, గుర్రాలు, గుర్రపు బగ్గీలు, ఎడ్ల బండ్లు పడవలు తదితరాల్లో ప్రయాణం చేసేవారు. ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా మారుమూల ఉన్న పోలింగ్‌ స్టేషన్లకు చేరుకుని ఓటు వేసేవారు. ఆ పోలింగ్‌ స్టేషన్లను బల్బు, ఫ్యాన్‌ వంటివి కూడా లేని గుడారాలు, వివిధ ప్రభుత్వ భవనాలు, స్కూళ్ల వరండాల్లో ఏర్పాటు చేసేవారు. పోలింగ్‌ విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు ఎండ తీవ్రత, ఉక్కపోతను తట్టుకునేందుకు విసనకర్రలతోనో, ఏదన్నా వార్తా పత్రికతోనూ విసురుకుంటూ ఉండేవారు. అయినా అప్పట్లో ఎండ తీవ్రత వల్లే ఓటింగ్‌కు వెళ్లడం లేని చెప్పేవారు చాలా అరుదుగా కనిపించేవారు. భారీ వర్షాల్లో ఎన్నికలు జరిగినప్పుడు, గజగజలాడించే చలిలోనూ ఇవే పోలింగ్‌ కేంద్రాలు ఉండేవి. అప్పట్లో ఓటర్లు, ఎన్నికల సిబ్బంది ఎదుర్కొనే కష్టాలు మీడియా దృష్టిని ఆకర్షించేవి’ అని ఒక సీనియర్‌ జర్నలిస్టు గుర్తు చేశారు.

మారిన పరిస్థితులు
కానీ.. ఇప్పుడు అధునాతన పరిస్థితులు, సదుపాయాలు, సమాచార విప్లవం నేపథ్యంలో అదే ఎండలను సాకుగా చూపి ఓటింగ్‌ శాతం తగ్గిందనడం అసలు విషయాన్ని పక్కదారి పట్టించడమేనని ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పారు. వాస్తవానికి ఎండల తీవ్రత కన్నా.. పొలిటికల్‌ వేవ్‌ అనేది లేకపోవడం వల్లే ఓటింగ్‌ తగ్గిందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ‘బస్తర్‌ లాంటి అటవీ ప్రాంతంలో ఓటింగ్‌ తగ్గిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఘజియాబాద్‌, నొయిడా లాంటి ప్రాంతాల్లోని ఖరీదైన బంగ్లాలు ఉండే కాలనీల్లో ఏసీల్లో ఉంటూ, అన్ని సదుపాయాలు ఉండి, వీకెండ్‌ వచ్చిందంటే ఉన్నపళంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లగలిగేవారు ఉన్న చోట్ల కూడా ఎందుకు పోలింగ్‌ శాతం తగ్గిందనేది అసలు ప్రశ్న. నిజంగా ఇది ఆందోళన కల్గించేదే. ప్రత్యేకించి అధికార బీజేపీ మరికాస్త కలవరం కలిగించేది’ అని ఆయన విశ్లేషించారు.

కరోనా సమయంలోనూ భారీ ఓటింగ్‌
ఎండల సంగతి పక్కన పెడితే.. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న 2021 ఏప్రిల్‌లో అది కూడా వేసవిలో అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు రెండు దశల్లో జరిగిన పోలింగ్‌కంటే ఎక్కువే వాటిలో నమోదైందని సీనియర్‌ పాత్రికేయుడు ఒకరు ప్రస్తావించారు. లక్షల మంది ప్రాణాలను కరోనా ఆ సమయంలో బలిగొన్న సంగతి తెలిసిందే. అయినా, ఆ మహమ్మారిని, ఎండలను లెక్క చేయకుండా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గతంలోనూ తక్కువ పోలింగ్‌ కానీ..
గతంలో తక్కువ పోలింగ్‌ నమోదైన సందర్భాలు లేవా? అంటే ఉన్నాయి. 1977లో 60.5శాతం, 1984లో కూడా 64 శాతం ఓటింగ్‌ నమోదైందని గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశ తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45శాతం కంటే తక్కువ పోలింగ్‌ నమోదైంది. ఎందుకంటే అప్పటికి ఎన్నికలంటే ప్రజలకు పెద్దగా తెలియదు. ఎన్నికల కమిషన్‌కు కూడా ప్రపంచంలోనే ఈ అతి భారీ ప్రక్రియను నిర్వహించడం అదే తొలిసారి. ఇప్పుడు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో 45శాతం కంటే తక్కువ ఓటింగ్‌ నమోదవడం గమనార్హం. బీహార్‌లోని నవాడాలో 41శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాస్తవానికి గతంలో ఈ సీట్లను బీజేపీ, దాని మిత్రపక్షాలు 2019లో గెలుచుకున్నాయి.

వేసవిలో ఎన్నికలకు బాధ్యత వాజ్‌పేయి ప్రభుత్వానిదే
నిజానికి వేసవిలో ఎన్నికలు రావడానికి అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని గత ప్రభుత్వమే కారణమని సీనియర్‌ జర్నలిస్టు ఒకరు అన్నారు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను మార్చివేసిందని చెప్పారు. అప్పట్లో అక్టోబర్‌లో లోక్‌సభ గడువు ముగియనున్నా.. 2003 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీల్లో విజయం సాధించిన తర్వాత ఈ విజయాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆరు నెలలు వాయిదా వేసిందని ఆయన తెలిపారు. అయితే.. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలి.. ఓడిపోయిందనేది వేరే సంగతి. అప్పట్లో మే 13న ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చకపోతే అందుకు సాకులను సిద్ధం చేసేందుకు ఎండల తీవ్రతను తెరపైకి తెస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.