Indigo Airlines Crisis | ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
వారం రోజులుగా ఎక్కడ చూసినా ఇండిగో విమానాల క్యాన్సిలేషన్ వార్తలే. ఏ సామాజిక మాధ్యమం చూసినా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల కష్టాల వీడియోలే! పైలట్ల విశ్రాంతి విషయంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో దేశంలోనే అత్యధికంగా ఇబ్బంది పడిన సంస్థ ఇండిగో. మరి ఒక్క ఇండిగోకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి? ఇతర ఎయిర్‌లైన్స్‌కు ఈ ఎఫెక్ట్ ఎందుకు పడలేదు?
Indigo Airlines Crisis | వారం రోజులుగా ఎక్కడ చూసినా ఇండిగో విమానాల క్యాన్సిలేషన్ వార్తలే. ఏ సామాజిక మాధ్యమం చూసినా ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల కష్టాల వీడియోలే! పైలట్ల విశ్రాంతి విషయంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో దేశంలోనే అత్యధికంగా ఇబ్బంది పడిన సంస్థ ఇండిగో. మరి ఒక్క ఇండిగోకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి? ఇతర ఎయిర్‌లైన్స్‌కు ఈ ఎఫెక్ట్ ఎందుకు పడలేదు?
ప్రభుత్వం తీసుకు వచ్చిన నిబంధనలతోపాటు.. ఇండిగోలో ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చిన భారీ శ్రమదోపిడీ కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ విమానయాన సంస్థ అయినప్పటికీ ఇండిగో వద్ద అత్యవసర వినియోగానికి బఫర్ స్టాఫ్ కేవలం నాలుగు శాతమేనని తెలుస్తున్నది. ఫలితంగానే కొత్త నిబంధనల అనంతరం వారంరోజులుగా వందల విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఫలితంగా వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అనేక మంది తమ కీలక సమావేశాలకు, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరుకాలేక పోయారు. కొందరైతే తమ సొంత వివాహ రిసెప్షన్ వేడుకలను సైతం మిస్ అయ్యారు. ఆరోగ్య సమస్యల రీత్యా వేరే ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకున్నవారు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనికి ప్రధాన కారణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన కొత్త డ్యూటీ నిబంధనలను చెబుతున్నారు. వాస్తవానికి ఈ నిబంధనలను 2024 జనవరిలోనే నోటిఫై చేశారు. కానీ.. వాటి అమలు వాయిదాపడుతూ వచ్చింది. నిజానికి అవి అమల్లోకి వచ్చేలోపు వివిధ విమానయాన సంస్థలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నది. ఇక్కడే సమస్య తలెత్తింది.
ఇండిగోపై తీవ్ర ప్రభావం వెనుక..
భారత డొమెస్టిక్ మార్కెట్‌లో ఇండిగో సంస్థ సుమారు 65 శాతం ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది. ఫలితంగానే ఎక్కువ మంది ప్రయాణికులు దీని ప్రభావానికి గురయ్యారు. డిసెంబర్ 2న భారీ స్థాయిలో సర్వీసుల రద్దు ప్రారంభమైంది. ఇందులో ఇండిగో విమానాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆన్‌టైమ్‌కు 35 శాతం విమానాలు మాత్రమే బయల్దేరాయని గణాంకాలు చెబుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఆకాశ, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వరుసగా 67శాతం, 73 శాతం, 79 శాతం నమోదు చేశాయని హెచ్‌టీ పేర్కొన్నది.
ఇంతటి సంక్షోభంలో ఒక్క ఇండిగో మాత్రమే ఎందుకు ప్రభావితమైంది? ఇతర ఎయిర్‌లైన్స్‌పై దీని ప్రభావం ఎందుకు పడలేదు? నిజానికి ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు దేశీయ మార్కెట్‌లో ఇండిగో వాటా చాలా పెద్దది. నెట్‌వర్క్ కూడా పెద్దది. దీంతో గొలుసుకట్టు ఎఫెక్ట్ అనివార్యమైంది. బఫర్ స్టాఫ్ అత్యంత తక్కువగా ఉండటం దీనికి శాపంగా మారింది. కొత్త నిబంధనల నేపథ్యంలో అదనపు పైలట్‌లు ఎంత మంది అవసరం అనే విషయంలో ఇండిగో తప్పుడు అంచనాలు వేసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాని Airbus A320 fleetకు మొత్తం 2,422 మంది కెప్టెన్లు అవసరం అని అంచనావేయగా.. అందుబాటులో ఉన్నది 2,357 మంది మాత్రమే. ఫస్ట్ ఆఫీసర్స్ విషయంలో కూడా ఇలాంటి తేడాలే ఉన్నాయని అంటున్నారు. తక్కువ స్టాఫ్‌తో, ఎక్కువ సర్వీసులు నడపడం కూడా దెబ్బతీసిందని చెబుతున్నారు.
ఈ పరిస్థితిపై ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పినా, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హోటళ్లలో బస, చార్జీల తిరిగి చెల్లింపు వంటివి చేసినా.. ఇదే అదునుగా ఇతర సర్వీసులు తమ టికెట్ రేట్లను భయానకంగా పెంచేశాయి. దీంతో మళ్లీ డీజీసీఏ రంగంలోకి దిగి.. తన నిబంధనలను రద్దుచేసి, టికెట్ రేట్లపై సీలింగ్ విధించాల్సి వచ్చింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram