భారత్ పైకి 130 అణుబాంబులు సిద్ధం: పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బెదిరింపులు

  • By: sr    news    Apr 27, 2025 6:29 PM IST
భారత్ పైకి 130 అణుబాంబులు సిద్ధం: పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బెదిరింపులు

విధాత: భారత్‌పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు పాకిస్థాన్‌ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ బహిరంగ బెదిరింపులకు దిగారు. వీటితోపాటు ఘోరీ, షహీన్‌, గజనీ క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. భారత్‌ సింధూ జలాలను నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాకిస్థాన్‌ నుంచి ఎదురుకానున్న తీవ్ర పరిణామాలను న్యూఢిల్లీ ఇప్పటికే అర్థం చేసుకుంటోందని అబ్బాసీ వ్యాఖ్యానించారు. రెండ్రోజులు గగనతలం మూసేస్తేనే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిందన్నారు. మరో 10 రోజులు ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయని చెప్పారు.

అంతేకాదు.. ఇబ్బందులు ఎదుర్కోవడానికి తామూ సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. పాక్‌ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపర్చామని.. భారత్‌ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదని.. అణ్వాయుధాలను ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదని.. మా బాలిస్టిక్‌ క్షిపణులు భారత్ ను లక్ష్యంగా చేసుకొంటాయి అని అబ్బాసీ పేర్కొన్నారు.

అంతకు ముందురోజే పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం వంటి చెత్త పనులన్నీ పశ్చిమదేశాల కోసం చేశామని అంగీకరించారు. ఇది పొరపాటేనని, ఆ పర్యవసానాలతో తమ దేశం ఇబ్బందులకు గురవుతోందని ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు.