UP: ప్రియుడితో కలిసి భర్తను చంపింది.. ఆపై పామును తీసుకు వచ్చి హైడ్రామా!

విధాత: ప్రియుడి మోజులో పడి భర్తలను, పిల్లలను దారుణంగా హతమారుస్తున్న ఘటనలు ఇటీవల దేశంలో కలకలం రేపుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో ప్రియుడితో కలిసి భార్య ముస్కాన్ రస్తోగీ తన భర్త సౌరభ్ రాజ్ పుత్ ను చంపి డ్రమ్ములో వేసి సిమెంట్ చేసిన ఘటన మరువకముందే హర్యానాలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే రవీనా అనే మహిళ.. తనకు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి సురేశ్ తో కలిసి భర్త ప్రవీణ్ ను ను హత్య చేసి కాలువలో పడేసింది. తెలంగాణలోని హైదరాబాద్ సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో ఓ తల్లి తన ప్రియుడితో బంధానికి అడ్డుగా ఉన్నారంటూ పన్నెండేళ్ల లోపున్న తన ముగ్గురు కుమారులను చంపిన ఘటన సంచలనం రేపింది.
తాజాగా ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలోనే బహ్సుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌పూర్ సదత్ గ్రామంలో అమిత్ అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. మంచంపై ఒక పాము కనిపించడంతో ఆ పాము కాటు వేయడం వల్లే తన భర్త చనిపోయాడని భార్య రవిత అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అమిత్ మృతదేహం మంచం మీద పడి ఉండగా, పాము పక్కన కనిపిస్తుంది. అయితే అమిత్ శరీరంపై పాముకాటు గాయాలు లేకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు అమర్ దీప్ తో కలిసి భార్యే భర్తను హత్య చేసిందన్న వాస్తవం వెలుగుచూసింది.
https://twitter.com/srk9484/status/1913135498597638645
అమర్‌దీప్‌తో రవిత వివాహేతర సంబంధం గురించి భర్త అమిత్‌కు తెలియడంతో ముందస్తు పథకం మేరకు అతని అడ్డుతొలగించుకునేందుకు హతమార్చినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈనెల 13న రాత్రి అమిత్ నిద్రపోతుండగా అతని గొంతు నులిమి చంపేశామని వెల్లడించారు. ఎవరికి అనుమానం రాకుండా పాముకరిచి చనిపోయినట్లుగా అందరిని నమ్మించే ప్రయత్నం చేశామన్నారు. ఇందుకోసం మహ్మూద్‌పుర్ సిఖేడా గ్రామానికి చెందిన పాములు పట్టే వ్యక్తి నుంచి రూ. 1000కి కొనుగోలు చేసి తెచ్చిన పామును మంచంలోని అమిత్ మృతదేహం కింద పెట్టామని నిందితులు తెలిపారు. ఈ ఘటనలో రవిత, అమర్‌దీప్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌పీ రాకేశ్ కుమార్ మిశ్రా వెల్లడించారు. ఇద్దరూ నేరాన్ని అంగీకరించారని చెప్పారు. రవిత, అమిత్‌లకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయిందని, వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు.
https://twitter.com/srk9484/status/1913135498597638645