ఏఐ లేఆఫ్‌ ట్రాప్‌… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?

ఏఐ కారణంగా రాబోయే ఉద్యోగాల కోతలు ఏకంగా ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చుతాయని గణిత నమూనాలు (మేథమెటికల్‌ మోడల్స్‌) వెల్లడిస్తున్నాయని అంటున్నారు. ఈ విషయం దాదాపు అన్ని కంపెనీల సీఈవోలకూ తెలుసనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ ఆఫ్‌ పెన్‌సిల్వేనియా, బోస్టన్‌ యూనివర్సటీ అధ్యయన పత్రం అత్యంత కీలకమైనదని చెబుతున్నారు.

  • By: TAAZ |    news |    Published on : Apr 14, 2026 9:55 PM IST
ఏఐ లేఆఫ్‌ ట్రాప్‌… ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చనున్నదా?

అత్యంత వేగంగా అభివృద్ధి అయి.. అనూహ్యంగా దూసుకుపోతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం.. కృత్రిమ మేధ. ఇది మనిషి పనిని మరింత సులభం చేస్తున్నది. సహజంగానే అనేక కంపెనీలకు ఇది వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. కొన్ని కంపెనీలు ఆ పేరుతో అవసరం ఉన్నా.. లేకున్నా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న విషయాన్నీ చూస్తున్నాం. మొత్తంగా ఇది ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుంది? అనే విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, బోస్టన్‌ యూనివర్సిటీ సంయుక్తంగా ఒక అధ్యన పత్రాన్ని రూపొందించాయి. ‘ఏఐ లేఆఫ్‌ ట్రాప్‌’ గేమ్‌ థియరీ పేపర్‌ పేరుతో విడుదలైన అధ్యయనం.. ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో ఆసక్తి రేపుతున్నది. అదే సమయంలో విస్తృత చర్చకు కూడా దారి తీస్తున్నది.

ఏఐ కారణంగా రాబోయే ఉద్యోగాల కోతలు ఏకంగా ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చుతాయని గణిత నమూనాలు (మేథమెటికల్‌ మోడల్స్‌) వెల్లడిస్తున్నాయని అంటున్నారు. ఈ విషయం దాదాపు అన్ని కంపెనీల సీఈవోలకూ తెలుసనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ ఆఫ్‌ పెన్‌సిల్వేనియా, బోస్టన్‌ యూనివర్సటీ అధ్యయన పత్రం అత్యంత కీలకమైనదని చెబుతున్నారు. ఈ పత్రాన్ని arXiv ప్లాట్‌ఫామ్‌లో ఇటీవల పబ్లిష్‌ చేశారు. ఈ పత్రంలో అత్యాధునిక శాస్త్ర సిద్ధాంతాలను ఉపయోగించి.. ఒక సంక్లిష్ట వ్యవస్థను పరిశోధకులు విశ్లేషించారు.

ఏఐ దూకుడు పెరిగిన నేపథ్యంలో అమెరికాలో 2025 సంవత్సరంలోనే లక్షకుపైగా టెక్‌ ఉద్యోగాలు పోయాయని చెబుతున్నారు. దీనితో అమెరికాలో 80 శాతం ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీన్ని ఆపే మార్కెట్‌ శక్తి ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు.

ఈ పత్రం అంచనా ప్రకారం.. ఏఐ నేపథ్యంలో ప్రతి కంపెనీ తన ఖర్చులు తగ్గించుకోవడానికి లేఆఫ్‌లకు దిగుతుంది. ఉద్యోగాలు కోల్పోయి, నిరుద్యోగులుగా మారినవారి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. తద్వారా వారు వస్తువులు కొనుగోలు చేయడం తగ్గిస్తారు. ఇది దాదాపు అన్ని రంగాలపైనా ప్రభావం చూపుతుంది. ఫలితంగా అయా రంగాల్లో ఆదాయాలు పడిపోతాయి. అంతిమంగా ఏ కంపెనీలైతే ఉద్యోగులను తొలగించాయో.. అవే కంపెనీలు చివరకు దివాలా తీస్తాయి. దీని విస్తృతి పెరిగే కొద్దీ.. అంటే.. ఏఐ ట్రాప్‌లో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తే.. అంతిమంగా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. దీన్ని Prisoner’s Dilemmaతో పోల్చుతున్నారు. ఇప్పటికే ఈ ట్రాప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చుట్టుముడుతున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ.. ఈ డాక్యుమెంట్‌ ఇంకా పీర్‌ రివ్యూ కావాల్సి ఉన్నది.

ఈ సమస్యను యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కమ్‌ (యూబీఐ) లేదా ప్రాఫిట్‌ ట్యాక్స్‌ పరిష్కరించలేవని పరిశీలకులు చెబుతున్నారు. పిగూవియన్‌ ఆటోమేషన్‌ ట్యాక్స్‌ ఒక్కటే దీనికి పరిష్కారమని పేర్కొంటున్నారు. అంటే.. కంపెనీలు ఏఐ లేదా ఆటోమేషన్‌ వాడి ఉద్యోగాలను తొలగిస్తే సదరు కంపెనీలపై పన్ను విధించడం. ఆటోమేషన్‌, లేదా ఏఐ వల్ల కంపెనీలు ఉద్యోగులను తగ్గించి.. ఆదాయాలు పెంచుకుంటాయి. అంటే.. కంపెనీకి లాభం జరిగినా అంతిమంగా సమాజానికి నష్టం చేకూరుతుంది. ఇలా సమాజానికి నష్టం చేసే కంపెనీలపై విధించే పన్నునే పిగూవియన్‌ ఆటోమేషన్‌ ట్యాక్స్‌ అంటారు. ఈ పన్ను ద్వారా సమకూరిన ఆదాయాన్ని నిరుద్యోగులకు ప్రయోజనాలు కల్పించేందుకు, నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చు.