Alekhya Chitti Pickles | అలేఖ్య చిట్టి పికిల్స్.. సోష‌ల్ మీడియా షేకింగ్‌! అస‌లు క‌థ ఇది

  • By: sr    news    Apr 04, 2025 4:23 PM IST
Alekhya Chitti Pickles | అలేఖ్య చిట్టి పికిల్స్.. సోష‌ల్ మీడియా షేకింగ్‌! అస‌లు క‌థ ఇది

విధాత: ఏపీలో పచ్చళ్లు అమ్ముకునే అక్కాచెల్లెళ్లు వినియోగదారులతో మాట్లాడిన సందర్భంలో దుర్భాషలాడిన వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ గా ఫేమస్ అయిన రాజమండ్రికి చెందిన అక్కాచెల్లెళ్లు అలేఖ్య, చిట్టి, రమ్యలు `అలేఖ్య చిట్టి పికిల్స్” (Alekhya Chitti Pickles) పేరుతో నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం చేస్తున్నారు. వారికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఫారన్ నుంచి కూడా పచ్చళ్ల కోసం ఆర్డర్లు వస్తుంటాయి. వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వాళ్ల దగ్గరున్న పచ్చళ్లు, వాటి రేట్ల వివరాలను మనకు పంపించేస్తారు. వీళ్ల పచ్చళ్లు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో.. సహజంగానే డిమాండ్ పెరిగింది.

వ్యాపారం బాగుండటంతో అలేఖ్య చిట్టి పికల్స్ సిస్టర్స్ పచ్చళ్ల రేట్లను కూడా పెంచేశారు. ఇటీవల ఓ కస్టమర్ కిలో రోయ్యల పచ్చడి కావాలని వాట్స‌ాప్ ద్వార‌ కోరగా.. వారు కిలో రూ.3వేలని చెప్పారు. కిలో రోయ్యల పచ్చడికి రూ.3వేలా..? ఇది చాలా ఎక్కువంటూ వినియోగదారుడు బేరమాడి ఆ ప‌చ్చ‌ళ్లు వ‌ద్ద‌నుకున్నాడు. అయితే కాపేప‌టికి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్లు రెచ్చిపోయి అభ్యంతరకంగా నోరుపారేసుకుంటూ ఓ ఆడియో క్లిప్ ఆ వినియోగదారుడికి పంపింది. 3వేలు పెట్టి పచ్చడి కొనలేని వాడివి..రేపు నీ పెళ్లానికో.. గర్ట్‌ ఫ్రెండ్ కో బంగారం.. చీరలు ఏం కొనిస్తావు.. బయటకు ఎలా తీసుకెళ్తావ్ అంటూ ఎద్దేవా చేసింది. నీ అంత చీఫ్ వ్యక్తి ఎక్కడా ఉండడు.. నీవు ముందు గట్టిగా కెరీర్ మీద ఫోకస్ చేసి ముందు డబ్బులు సంపాదించుకోవడం నేర్చుకోరా అంటూ దుర్భాషలాడింది.

అవాక్కయిన వినియోగదారుడు కోపంతో ఈ ఆడియోను ఫేస్బుక్, యూ ట్యూబ్‌ల‌లో పోస్టు చేశాడు. ఇంకేముంది క్ష‌ణాల్లో ఈ ఆడియో వైర‌ల్ అయి అలేఖ్య పికిల్స్ వాళ్ల‌ను నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఆడుకోవ‌డం మొద‌లు పెట్టారు. మీ పచ్చళ్లు తిని నా భార్యకు కడుపు వచ్చిందని, ఒక‌రు, పెళ్లైంద‌ని, పెద్ద మ‌నిషిన‌య్యాను అంటూ కామెంట్లు చేస్తూ, మీములు పెడుతూ రెండు రోజులుగా సోష‌ల్ మీడియాను అల్లాడిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తమ పట్ల భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకున్నారు. తమ వాట్సాప్‌, ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్లు, వెబ్ సైట్ సైతం బంద్ చేశారు. చివ‌ర‌కు శుక్ర‌వారం ఆ ముగ్గురిలో ఒక‌రు ఓ వీడియో రిలీజ్ చేసి త‌మ వాద‌న‌ను వినిపించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అందులో ఎక్క‌డా క్ష‌మాప‌ణ చెప్ప‌లేదంటూ తిరిగి నెటిజ‌న్లు ట్రోల్ చేయ‌డంతో కొద్ది సేప‌టి త‌ర్వాత మ‌రో సోద‌రి ర‌మ్య అస‌లు విష‌యం ఇదంటూ మ‌రో వీడియోను రిలీజ్ చేసింది.

ముగ్గురం అక్కా చెల్లెళ్లం క‌లిసి ఈ ప‌చ్చ‌డి వ్యాప‌రం చేస్తున్నామ‌ని, అయితే చాలామంది ఆక‌తాయిలు ప‌చ్చ‌ళ్లు కావాల‌నే నెపంతో వేల‌కు వేలు మేసేజులు పెడుతూ, ఫోన్లు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నార‌ని ఆ నేప‌థ్యంలో అలాంటి వారికి వారి భాష‌లోనే స‌మాధానం ఇవ్వాల‌ని మేం సిద్ధ‌మై ఆ ఆడియో క్లిప్ చేశామ‌ని తెలిపింది. అయితే ఆ ఆడియోను అనుకోకుండా ఒక‌రికి బ‌దులు మ‌రొక‌రికి చూసుకోకుండా పంపించామ‌ని, మేం గ‌మ‌నించి దానిని డిలీట్ చేసిన‌ప్ప‌టికీ అప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిందంటూ చెప్పుకొచ్చింది. ఆ త‌ర్వాత ఆ వినియోగ‌దారుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాం.. ఇవిగో ఫ్రూఫ్స్ అంటూ వాట్స‌ప్‌ చాట్ స్క్రీన్ షాట్లు చూయించింది. ఇక‌నైనా ద‌య‌చేసి మా బాధ‌ల‌ను సైతం అర్థం చేసుకోవాల‌ని, ఇక ఈ వివాదాన్ని ఇక్క‌డితో ముగించాల‌ని ఇప్ప‌టికే మా ప‌చ్చ‌ళ్ల బిజినెస్ పూర్తిగా స‌న్న‌గిల్లింద‌ని, రేట్లు సైతం త‌గ్గించామ‌ని కానీ బిజినెస్ అస‌లు జ‌ర‌గ‌డం లేద‌ని పేర్కొంది.

ఇదిలాఉండ‌గా మ‌రోవైపు.. అదే సమయంలో పచ్చళ్ల‌ ధరపై బేరమాడిన మరో అమ్మాయితో అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఎద‌ురైన పరుష వ్యాఖ్యలతో కూడిన మ‌రో ఆడియో లీక్ అయింది. పచ్చడి ధర ఎక్కువన్న అమ్మాయిని ఓసే పిచ్చిముఖం దానా..ఇంత తక్కువ రేట్లను కూడా నీవు భరించలేకపోతున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నాకు అర్ధమవుతుందని.. నామాట విని ఏ నాలుగు ఇండ్లలో పాచి పని చేసుకో బతుకు అంటూ వ్యాఖ్యానించింది. దీంతో సోషల్ మీడియాలో ఆ ముగ్గురు చెల్లెళ్లను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం అంత‌కంత‌కు వైరల్ అవుతూనే ఉంది. ఇది ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుందో అంతుబ‌ట్ట‌కుండా ఉంది.

ప్పుడు కస్టమర్లు దేవుళ్లన్నారు..

నాన్న నిర్వహించిన పచ్చళ్ల వ్యాపారాన్నిఆయన పోయిన తర్వాతా ఇంటి బాధ్యతను మోస్తూ కూతుళ్లుగా మేం ముందుకు తీసుకెలుతామని చెప్పిన ఆలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ చేసిన వీడియోను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. నాన్న చూపిన బాటలో కస్టమర్లు మాకు దేవుళ్లతో సమానమని..వాళ్లు బావుంటే మనం బావుంటాం అని నాన్న చివరి రోజుల మాటలను పాటిస్తూ అలేఖ్య చిట్టి పికిల్స్ ఉన్నంత కాలం మంచి క్వాలిటీతోనే ఇస్తాం’ అంటూ వీడియోలో చెప్పారు. ఇప్పుడేమో పచ్చళ్ల వ్యాపారం బాగా వృద్ధి చెందాకా అహంకారంతో కస్టమర్లను నిందిస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ తో మేల్కొన్న అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ జరిగిన సంఘటనపై క్షమాపణలు తెలిపారు.

అదే సమయంలో ఒకవైపు తప్పు జరిగితే ప్రశ్నించడంతో పాటు అంతకు రెట్టింపు స్థాయిలో దుర్భాషలాడటం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే.. పచ్చళ్లు బాగా పెడితే మాత్రమే సరిపోదు. మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లయ్‌లు కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలని అలేఖ్య పికెల్స్ ఉదంతం చెబుతోంది. మొత్తం మీద సోషల్ మీడియా సాధనంగా తమ పికిల్స్ వ్యాపారాన్ని పీక్ స్టేజీకి తీసుకెళ్లిన అక్కాచెల్లెళ్లు చివరకు తమ నోటి దురుసు తనంతో అదే సోషల్ మీడియా ట్రోలింగ్ దెబ్బకు దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తడం విషాదకరం.