BRS సభ కోసం సర్వత్రా ఉత్కంఠ

సభ కోసం ఎల్కతుర్తి లో విస్తృత ఏర్పాట్లు
బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్
విధాత వరంగల్ ప్రతినిధి: బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోందని, సభ ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రజతోత్సవ సభ ఏర్పాట్లను ఆయన బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాసు రెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ స్పీచ్ కోసం తెలంగాణ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు.
ఇది పార్టీ సభ కాదు… ప్రభుత్వంపై తిరుగుబాటు సభ అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో కోపం , కసితో ఉన్నారన్నారు. 25 ఏండ్ల నవ యవ్వన పార్టీ బీఆర్ఎస్ అంటూ రజతోత్సవ సభ కోసం గత నెల రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నామని మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ బాబు నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉమ్మడి జిల్లా నాయకులంతా కలిసి సమిష్టిగా పని చేస్తున్నామని నభూతో న భవిష్యత్ అనే విధంగా సభ నిర్వహించబోతున్నామని వివరించారు.
సభ కోసం 1200 ఎకరాలతో పాటు మరో 300 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు వస్తున్నారని చెప్పారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు, ఏర్పాట్లు చేస్తున్నాం, తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లను అందిస్తామని చెప్పారు. ట్రాఫిక్, సభ నిర్వహణకు వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నాం. వారికి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సభా వేదిక వద్ద వైద్య సేవలను సైతం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రెండు మూడు రోజుల్లో సభకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని వినయ్భాస్కర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.