కమీషన్ కొట్టు… కాంట్రాక్టు పట్టు.. కాంగ్రెస్ ముఖ్యనేతకు లగ్జరీ కారు నజరానా?

తెలంగాణ ప్రభుత్వంలో వీరు వారు అనే తేడా లేకుండా పరపతి కలిగిన కాంగ్రెస్ నాయకులు తెర వెనుక పనులు చక్కబెడుతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించేందుకు డబ్బులు లేవని వేదికల ప్రజలకు నమ్మబలికే ప్రయత్నం చేస్తున్న నేతలు, అంతర్గతంగా తమకు నచ్చిన వారికి పదుల కోట్లు చెల్లిస్తుండడమే కాకుండా, నామినేషన్లపై విలువైన కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది.

telangana payments contract row image generated with ai help

విధాత, హైదరాబాద్:

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో రూ.94 కోట్ల విలువైన పని అప్పగించినందుకు సదరు కాంట్రాక్టర్ బహుమానంగా ఖరీదైన కారు అప్పగించారని జోరుగా ప్రచారం సాగుతున్నది. కంపెనీ పేరుతో ఉన్న ఆ కారు ఇప్పుడు నార్సింగి లోని ముఖ్య నేత ఇంట్లోని పార్కింగ్ స్థలంలో ఉందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. కోటి రూపాయలు పైబడి విలువ చేసే బ్రాండ్ న్యూ లగ్జరీ బీఎండబ్ల్యూ కారును ఆ నాయకుడి పేరు మీద కాకుండా తమ సంస్థ పేరు మీద కొనిచ్చిందనే టాక్ గాంధీ భవన్‌లో నడుస్తోంది. రాష్ట్రంలో క్విడ్ ప్రో కో పాలన నడుస్తోందని, సామాన్య కార్యకర్తలకు పనులు కావడం లేదని వారిలో వారు పెదవి విరుచుంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేదని, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను విస్మరిస్తున్నారని అనుకుంటున్నారు.

ఉద్యోగుల బకాయిలకు మాత్రం డబ్బు లేదు..

బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, చోటా మోటా కాంట్రాక్టర్లు సచివాలయం చుట్టూ చక్కర్లు కొట్టినా మంజూరు కావడం లేదు. తమ డబ్బులు తమకు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకుంటున్నారని రిటైర్డు ఉద్యోగులు రెండున్నరేళ్ల నుంచి లబోదిబోమంటున్న విషయం తెలిసిందే. అయినా వారికి ఆవేదన మిగిలింది తప్పితే బ్యాంకు ఖాతాల్లో మాత్రం బకాయిలు జమ కావడం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ఫలితం కన్పించడం లేదు. ఉద్యోగుల నుంచి లేదా తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తే ఎత్తడానికి జంకుతున్నారంటే నాయకుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఉద్యోగ సంఘం నాయకుడు మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల వద్ద పోరాడుతున్నామని, ఆ విషయాలను ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నామన్నారు. అయినా ఆగ్రహం ఆపుకోలేని కొందరు ఉద్యోగులు బూతుల దండకం అందుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల దుస్థితి ఇలా ఉండగా నాయకులకు మాత్రం ఎక్కడా కరువు కన్పించడం లేదు. తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Latest News