ఉద్యోగులు, విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న సర్కార్.. రేవంత్‌ పాలనపై రగులుతున్న జనం

రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రయోజనాలు.. పెండింగ్‌! ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు... పెండింగ్‌! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు.. పెండింగ్‌! మహాలక్ష్మి ప్రయాణాలకు ఆర్టీసీకి చెల్లించాల్సినవి.. పెండింగ్‌! నీటిపారుదల శాఖలో పనులకు చెల్లింపులు.. పెండింగ్‌! ఆర్‌అండ్‌బీ శాఖలో చిన్న మరమ్మత్తులకూ నిధులు లేవు! తాగునీటి సరఫరా విభాగానీకి.. నిధుల కొరత! ఇదేం పాలన.. ఇదెక్కడి ప్రభుత్వం? అంటూ మండిపడుతున్నారు వివిధ వర్గాల వారు. రేవంత్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులు, విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న సర్కార్.. రేవంత్‌ పాలనపై రగులుతున్న జనం
  • కమీషన్‌లు ఇచ్చేవారికే ఆర్థిక శాఖ బిల్లులు మంజూరు
  • ఏ విభాగం చూసినా వేల కోట్లలో పెండింగ్ బకాయిలు

విధాత, హైదరాబాద్ : 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యవహారంపై రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఆర్థిక శాఖ ముప్పుతిప్పలు పెడుతున్నదని ఉద్యోగులు రగిలిపోతున్నారు. పదవీ విరమణ ప్రయోజనాల కోసం చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పైసా విదిల్చడం లేదని రిటైర్డు ఉద్యోగులు అరిగోసపడుతున్నారు.

ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు 15వేల కోట్ల బకాయిలు

ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు ఇప్పటి వరకు రూ.6వేల కోట్ల వరకు పెండింగ్ బకాయిలు చెల్లించారు. ఇంకా చెల్లించాల్సినవి రూ.15వేల కోట్ల వరకు ఉన్నాయని ఆ సంఘాల నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. డీఏ పెండింగ్ బకాయిల కోసం ఉద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తన్నా ఆర్థిక శాఖ మంత్రి కనికరించే పరిస్థితిలో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగుల బకాయిల కోసం ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున 2025 జూన్ నెల నుంచి ఆర్థిక శాఖ బిచ్చమేస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. రిటైర్‌ అయ్యి రెండు సంవత్సరాలు దాటినా పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏళ్లుగా బకాయిలు పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే 61 మంది రిటైర్డు ఉద్యోగులు అకాల మరణం చెందారు. డబ్బులు లేకపోవడంతో తగిన చికిత్స చేయించుకోలేక కొందరు, మానసికంగా ఆందోళనకు గురై మరికొందరు, పెళ్లీడుకొచ్చిన పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నామనే ఆవేదనతో మరికొందరు చనిపోయారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు వాయిదాల ప్రకారం డీఏ బకాయిలు చెల్లించుకుంటూ పోవడం మూలంగా అంతకంతకూ బకాయిలు పెరుగుతునే ఉన్నాయి. ప్రతి నెలా ఉద్యోగులకు రూ. 700 కోట్లు విడుదల చేస్తూ తీపి కబురు, లక్షలాది మంది ఉద్యోగులకు శుభవార్త అంటూ ప్రచార ప్రసార సాధనాల్లో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ఉద్యోగులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మా పైసలు మాకే చెల్లిస్తూ తీపి కబురు అని ప్రచారం చేస్తారా? అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎఫ్, లీవ్ సరెండర్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌, మెడికల్ రీయింబర్స్‌మెంట్‌, టీజీఎల్ఐసీ వంటి బిల్లుల కోసం ప్రతి నెలా విడుదల చేస్తున్న రూ.700 కోట్లను.. రూ.1,500 కోట్లకు పెంచాలని డిమాండ్లు చేస్తున్నా డిప్యూటీ సీఎం ఏమాత్రం చెవికి ఎక్కించుకోవడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇరిగేషన్‌లో 25వేల కోట్లు పెండింగ్‌

నీటిపారుదల శాఖలో చేసిన పనులకు రూ.25వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని తెలుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4వేల కోట్ల వరకు మాత్రమే చెల్లింపులు చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.5వేల కోట్ల వరకు చెల్లింపులు చేయగా, పెండింగ్‌లో రూ.20వేల కోట్ల వరకు ఉన్నాయి. ఉచిత విద్యుత్ పథకానికి ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ, ఆ నిధులను చెల్లించకుండా ఇతర పథకాలను మళ్లించడంతో పంపిణీ సంస్థలు కోలుకోలేని విధంగా తయారవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు సంబంధించిన కరెంటు బిల్లులు రూ.33 కోట్ల వరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సి ఉన్నది. వీటికి 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.22వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని, పూర్తయిన పనులకు కూడా చెల్లించడం కష్టమని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

గుంతలు పూడ్చలేరు.. మరమ్మతులు చేయలేరు..

గుంతలు పడిన రోడ్లను భవనాల శాఖలో నిధుల లేమి కారణంగా పూడ్చలేకపోతున్నారు. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అనే విధంగా ప్రతి అడుగుకో గుంత కన్పిస్తున్నదని, వాహనాలను నడపలేకపోతున్నామని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి రెండు సంవత్సరాలు దాటుతున్నా గుంతలు పూడ్చకుండా కళ్లకు గంతలు కడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆర్అండ్‌బీ శాఖలో కాంట్రాక్టర్లు పూర్తి చేసిన పనులకు ఇంకా రూ.10వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని సమాచారం. పంచాయతీరాజ్ శాఖలో కూడా రూ.8వేల కోట్ల వరకు బిల్లులు ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటి సరఫరా వ్యవస్థలో ఏమైనా చిన్న మరమత్తులు తలెత్తినా చేసుకోలేకపోతున్నామని ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారంటే ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతున్నది. గ్రామస్థాయిలో బిల్లులు ఎక్కువగా నిలిచిపోయాయని, తక్షణం పరిష్కరించాలని కోరుతున్నారు.

ఆర్టీసీకీ భారీగా బకాయిలు

ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన ప్రభుత్వం… ఆ మేరకు ప్రతి నెలా ఆర్టీసీకి నిధులు విడుదల చేయడం లేదు. రూ.6వేల కోట్ల వరకు మహాలక్ష్మీ పథకం కింద ఆర్థిక శాఖ ఆర్టీసీకి బకాయి పడిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థుల ఎదురుచూపులు

విద్యాశాఖలో విద్యార్థులు ఫీజు బకాయిల కోసం ఎదురు చూపులు చూస్తున్నా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏమాత్రం కనికరించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రూ.2,500 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెండింగ్‌లో పెట్టారని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫలితంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 2024-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి బకాయిలు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. పెండింగ్ బకాయిల చెల్లింపు డిమాండ్‌తో గతేడాది నవంబర్ నెలలో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాలేజీ యాజమాన్యాలను చర్చలకు ఆహ్వానించి, తక్షణమే రూ.600 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో బంద్‌ వాయిదా పడింది. మరో నెల రోజుల్లో రూ.300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంలో చర్చలు ఫలప్రదం కావడం, కాలేజీలు యథావిధిగా కొనసాగించారు.

గల్లాపట్టుకొని నెట్టేస్తున్నారు

అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రెండో అంతస్తులో సందర్శకులను రానివ్వకుండా పోలీసులను మోహరించారు. ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడకుండా ఉండేందుకు, వారిని కలువకుండా నిరోధించేందుకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా సాహసం చేసి వెళ్తే పోలీసులు గల్లా పట్టుకుని బయటకు తోసివేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి వేధింపులు లేవని, ఇదెక్కడి కాంగ్రెస్ మార్క్ ప్రభుత్వం అని రిటైర్డు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు దుమ్మెత్తిపోస్తున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా సంవత్సరాల తరబడి నాన్చుతూ వస్తున్నారు. అదేమంటే ఖజానాలో పైసలు లేవంటూ ప్రభుత్వ పెద్దలు నాటకాలాడుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు మండిపడుతున్నారు. ఇలా ఏ ఒక్క వర్గాన్ని కదిలించినా ఆగ్రహాలు, ఆవేశాలు, ఆందోళనలు తప్పితే కాంగ్రెస్ పాలనలో ఏమీ లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

బిల్లులు చెల్తిస్తేనే..ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు సరఫరా !
Assembly Elections | మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ షురూ..