విధాత, హైదరాబాద్ : పుష్పా 2 మూవీ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట వివాదంలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసి జైలుకు పంపించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అల్లు ఫ్యామిలీకి మరోషాక్ ఇచ్చింది. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కు అక్రమ భవన నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు అరవింద్ నాలుగు అంతస్తుల బిజినెస్ పార్కు భవనం నిర్మించారు. గీతా ఆర్ట్స్, అల్లు ఆర్ట్స్ వంటి సంస్థల కార్యాలయాలు ఈ భవనంలో కొనసాగుతున్నాయి. అయితే, అక్రమ నిర్మాణాల కారణంగా ఈ భవనం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది.
అయితే నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకుని తాజాగా భవనంపై అక్రమంగా ఓ పెంట్ హౌస్ నిర్మించారని జీహెచ్ఎంసీ గుర్తించింది. ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదంటూ జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు. ఇటీవలే మాతృవియోగానికి గురైన అల్లు అరవింద్ కు తాజాగా జీహెచ్ఎంసీ నోటీసుల రూపంలో మరో షాక్ ఎదురైనట్లయ్యింది. జీహెచ్ఎంసీ నోటీసుల వ్యవహారం చూస్తే తెలంగాణ ప్రభుత్వం అల్లు ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేస్తున్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.