Athletics: అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ఇండియా సీజన్ 2 ప్రారంభం

  • By: sr    news    Apr 18, 2025 6:34 PM IST
Athletics: అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ఇండియా సీజన్ 2 ప్రారంభం

ముంబై/పుణె/హైదరాబాద్: పిల్లల్లో చురుకుదనం పెంపొందించేందుకు UBS అథ్లెటిక్స్ కిడ్స్ కప్ రెండో సీజన్ ఘనంగా తిరిగి ప్రారంభమైంది. ముంబైతో పాటు పుణె, హైదరాబాద్ నగరాల్లో ఈ కార్యక్రమం విస్తరించింది. మొదటి సీజన్‌లో 1,000కి పైగా పాఠశాలల పాల్గొని, సుమారు లక్ష మంది పిల్లలు సమష్టిగా నిమగ్నమయ్యారు. ఈ అద్భుత స్పందన భారత యువతలో అథ్లెటిక్స్ పట్ల ఆసక్తి, పాఠశాలల్లో క్రీడల ప్రాముఖ్యతను తెలియజేసింది.

UBS మద్దతుతో నడిచే ఈ అట్టడుగు అథ్లెటిక్స్ చొరవ, పిల్లల్లో శారీరక చురుకుదనం, సమష్టి కృషి, క్రీడాస్ఫూర్తిని పెంపొందించేలా రూపొందింది. పుణె, హైదరాబాద్‌ల చేరికతో సీజన్ 2 మరింత విశాలమైన, ఉత్తేజకరమైన, సమగ్రమైన అనుభవాన్ని అందించనుంది. “భారతదేశంలో UBS అథ్లెటిక్స్ కిడ్స్ కప్ వృద్ధి చూస్తుంటే గర్వంగా ఉంది. కొత్త నగరాలకు విస్తరణ ద్వారా పిల్లల్లో క్రీడల పట్ల ప్రేమను పెంచడమే కాక, భవిష్యత్ అథ్లెట్లను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని Dspowerparts CEO డానియల్ షెంకర్ తెలిపారు.

మంచి కార్యక్రమం: నీరజ్ చోప్రా

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, కార్యక్రమ అంబాసిడర్ నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. “ఇంతమంది పిల్లలను ఒకచోట చేర్చి అథ్లెటిక్స్‌లుగా తీర్చిదిద్దడం మంచి కార్యక్రమం. ఇది భవిష్యత్ తరానికి ప్రేరణ కలిగించే వేదిక. పిల్లలు అథ్లెట్లుగా మాత్రమే కాక, చురుకుగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగేందుకు సాయపడుతుంది” అని అన్నారు.

సామాజిక బాధ్యత

“పాఠశాలల్లోనే కాక విద్యార్థుల ఆరోగ్యం తదితర అంశాల్లో వారి ఎదుగుదలకు అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. మొదటి సీజన్ విజయం మాకు సంతృప్తినిచ్చింది. రెండో సీజన్ మరింత ప్రభావవంతంగా ఉంటుంది” అని యూబీఎస్ ఇండియా సర్వీస్ కంపెనీ హెడ్ మాథియాస్ షాకే అన్నారు.